పంద్రాగస్టున స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ షురూ.!
Publish Date:Aug 14, 2026
Advertisement
పంద్రాగస్టు సందర్భంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక మార్పునకు తెలంగాణ సర్కర్ శ్రీకారం చుడుతోంది. ఆగస్టు 15 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అఫీషియల్ గా ప్రారంభించనున్నారు. భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ఈ కార్డులను లబ్ధిదారులకు అందజేయడం ద్వారా పౌరసరఫరాల సేవల్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఈ నూతన స్మార్ట్ రేషన్ కార్డులను నకిలీలకు తావులేకుండా, దుర్వినియోగాన్ని అరికట్టేలా ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లతో డిజైన్ చేశారు. కార్డు ముందరి భాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఆధారిత హోలోగ్రామ్ వంటి రక్షణ అంశాలను పొందుపరిచారు. ఇవి రేషన్ కార్డుల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే, రాష్ట్రంలోని మిగిలిన 33 జిల్లాల కేంద్రాల్లోనూ ఏకకాలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, అన్ని జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1.06 కోట్లకు పైగా ఆహార భద్రతా కార్డులు ఉండగా, వీటి ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారుల్లో ప్రతీ ఒక్కరికీ నెలకు ఉచితంగా 6 కిలోల సన్న బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ స్మార్ట్ డిజిటల్ కార్డుల వల్ల సరుకుల పంపిణీ వేగవంతమవ్వడమే కాకుండా, డేటా నిర్వహణ మరింత సులభతరం అవుతుంది. రేషన్ బియ్యం పంపిణీ, రైతుల నుంచి ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ. 34 వేల కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో కేవలం బియ్యం సబ్సిడీకే రూ. 14 వేల కోట్లు కేటాయిన్నది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సమర్థవంతంగా చేరవేసే లక్ష్యంతోనే ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెడుతోంది. Telangana government, Smart Ration Cards, CM Revanthreddy, Distributiob, Sangareddy
http://www.teluguone.com/news/content/telangana-government-36-228918.html





