రాజ్ భవన్ లో తెలంగాణ డే ఉత్సవాలు
Publish Date:Jun 1, 2022
Advertisement
రాజ్ భవన్ లో గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొంటారు. గురువారం సాయంత్రం 8.30 నిముషాలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి బుధవారం ఒక ప్రకటన వెలువడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరౌతారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమిళిసై జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేస్తారు. కాగా జూన్ 2 (గురువారం) తమిళసై జన్మదినం కావడం విశేషం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, గవర్నర్ జన్మదినం ఒకే రోజు కావడంతో రాజ్ భవన్ లో రెండు సంబరాలూ వేడుకగా జరుగుతాయని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం, రాజ భవన్ విభేదాల నేపథ్యంలో రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమానికి కేసీఆర్ కానీ, ప్రభుత్వం తరఫున కానీ ఎవరైనా హాజరౌతారా అన్న అనుమానాలు పొడసూపుతున్నాయి. ఇటీవలి కాలంలో గవర్నర్ పర్యటనల సందర్భంగా అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని తమిళిసై స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో గురువారం రాజ్ భవన్ లో జరిగే తెలంగాణ డే కార్యక్రమానికి ప్రొటోకాల్ ప్రకారం హాజరు ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా గురువారం ఉదయం పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. కాగా తెలంగాణ ఫార్మేషన్ డే కార్యక్రమం కారణంగా హైదరాబాద్ లో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. ఉదయం 7.30 గంటల నుంచి 11 గంటల వరకూ తాజ్ ఐల్యాండ్, చపెల్ రోడ్ టీ జంక్షన్, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, బషీర్ బాగ్ జంక్షన్, ఇక్బాల్ మినార్, ఎఆర్ పెట్రోల్ పంప్, ఆదర్శ్ నగర్ లలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని వివరించారు.
http://www.teluguone.com/news/content/telangana-formation-day-celebrations-in-raj-bhawan-25-136830.html





