కృష్ణా జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్! ముఖ్య నేత ఇంట్లో కస్టమ్స్ తనిఖీలు
Publish Date:Feb 1, 2021
Advertisement
పంచాయతీ ఎన్నికల వేళ కృష్ణా జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బడా వ్యాపారిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంట్లో కస్టమ్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. వీరులపాడు మండలం వైసీపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నాల్లో ఉన్న పూల రాంబాబు నివాసంలో.. తెలంగాణ కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండటం కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం, జుజ్జూరు గ్రామానికి చెందిన పూల రాంబాబు ఇంట్లో తెల్లవారుజాము నుంచి తెలంగాణ కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులుండటంతో పాటు ట్సాక్స్ ఎగవేత ఆరోపణలపై దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పూల రాంబాబుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో పలు పరిశ్రమలున్నట్లు తెలుస్తోంది. ఆ పరిశ్రమలకు సంబంధించిన పన్నులు, ఆదాయానికి సంబంధించిన అవకతవకలను గుర్తించినట్లు సమాచారం. పూల రాంబాబుపై ఎప్పటి నుంచో నిఘా ఉంచిన కస్టమ్స్ అధికారులు.., వారం రోజులుగా జుజ్జూరు గ్రామంలో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. రాంబాబుకు వివిధ రూపాల్లో నెలకు రూ.7కోట్ల వరకు వడ్డీ వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని కంపెనీల్లో షేర్లతో పాటు సొంతగా మరికొన్ని పరిశ్రమలకు శంకుస్థాపన చేసినట్లు సమాచారం. వీరులపాడు మండలంలో పూల రాంబాబు అధికార వైసీపీకి కీలకనేతగా ఉన్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున మండల వ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల ఏకగ్రీవాలు, ఎలక్షన్ ఫండ్స్ విషయంలో ఈయనే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పూల రాంబాబు ఇంట్లో కోట్ల రూపాయల నగదు ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.
http://www.teluguone.com/news/content/telangana-customs-officers-raids-on-krishna-ycp-leader-39-109441.html





