కాంగ్రెస్ తెలంగాణ ఇన్ చార్జ్ ప్రియాంక.. లోక్ సభకు పోటీ కూడా ఇక్కడ నుంచే?!
Publish Date:Jun 6, 2023
Advertisement
హిమాచల్ విజయంతో ఊపిరి తీసుకుని, కర్ణాటక గెలుపుతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేద్రీకరించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాకు అప్పగించినట్లు తెలుస్తోంది. అంతే కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రియాంక రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీచేస్తారని కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి. వాస్తవానికి చాలా కాలంగా ప్రియాంక గాంధీ తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఒక దశలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి మధ్య మాటల యుద్ధం గీతలు దాటి, పతాక స్థాయికి చేరిన సమయంలో ప్రియాంక జోక్యంతోనే ఆ వివాదం సర్దు మణిగిందని అంటారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటి రెడ్డి వెంకట రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు, ఆపై అటు నుంచి ఇటు నుంచి అటు పేలిన తూటాల నేపధ్యంలో తమ్ముడు రాజగోపాల రెడ్డి బాటలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.. బీజేపీ పెద్దలతోనూ చర్చలు జరిపారు. అయితే, ఆ సమయంలో ప్రియాంక జోక్యం చేసుకుని కోమటి రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాతనే ఆయన మెత్తబడి, ఎన్నికల సమయంలో వివాదాలకు దూరంగా ఉండేందుకు విదేశాలకు వెళ్ళారని అంటారు. అయితే అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే కోమటి రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రియాంకతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాతనే తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను ఖండించారు. అందుకే కావచ్చు కోమటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీలో కొనసాగడానికి ప్రియాంక చూపిన చొరవే కారణమని అంటారు. అలాగే రేవంత్ రెడ్డికి అనుకూలం అనే ముద్ర పడిన మాణిక్యం ఠాగూర్ ను పార్టీ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించి, మాణిక్‌రావ్ ఠాక్రేకు బాధ్యతలు అప్పగించడం వెనక ప్రియాంక పాత్ర కీలకమని అంటారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయంపై ధీమాతో ఉంది. మిగిలిన పార్టీల కంటే ఒకటి రెండు అడుగులు ముందుంటోంది. ఎన్నికల సమాయత్తంలో కానీ, వ్యూహాలలో కానీ ఈ సారి కాంగ్రెస్ వేగం పెరిగింది. కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణపై దృష్టి సారించాలని బీజేపీ భావిస్తుంటే, కర్నాటక ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. సరిగ్గా ఏడాది క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలోని వరంగల్‌లో ‘రైతు డిక్లరేషన్’ ప్రకటన చేస్తే.. ఇప్పుడు ‘యూత్ డిక్లరేషన్’ పేరిట యువతను టార్గెట్ చేసింది. అన్ని వర్గాల ప్రజానీకానికి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. ఇక రాష్ట్రంలో ప్రియాంక పర్యటన ఇలా ముగిసిందో లేదో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలలో శ్రీమతి గాంధీ వారసురాలిగా పార్టీ శ్రేణులు భావించే ప్రియాంకా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంటు ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఇందుకోసం ఆమె మెదక్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారని చెబుతున్నారు. 1980 మధ్యంతర ఎన్నికలలో ఇందిరాగాంధీ రాయ్‌బరేలీతో పాటు తెలంగాణలోని మెదక్ నుంచి కూడా పోటీ చేశారు. తన సొంత రాష్ట్రమైన రాయ్‌బరేలీలో ఏడు వేల మెజారిటీ తెచ్చుకుంటే, మెదక్ నుంచి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో ఆమెను తెలంగాణ ప్రజలు గెలిపించారు. ఇప్పుడు ప్రియాంక పోటీ చేసినా అదే ఫలితం వస్తుందన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో చాలా బలంగా వ్యక్తమౌతోంది. ప్రియాంకను ‘ఫేస్ ఆఫ్ ది తెలంగాణ కాంగ్రెస్ గా రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. ప్రియాంక తెలంగాణ నుంచి పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో జోష్ అమాంతం పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి ప్రియాంక తెలంగాణలో పోటీ కోసం రెండు నియోజకవర్గాలను కూడా పెద్దలు ఎంపిక చేశారని సమాచారం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకోవడంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. అయితే పీసీసీ చీఫ్ రేవంత్ ఈ సారి మాత్రం అవకాశాన్ని చేజార్చుకోవాలని అనుకోవడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ విషయంలో సీరియస్‌గానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే రేవంత్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అన్నిటికీ మించి ప్రియాంకా గాంధీ యూత్ డిక్లరేషన్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బీజేపీని ఢీ కొట్టలేక చతికిలపడుతున్న కాంగ్రెస్‌కు ప్రియాంక రూపంలో ఊపిరిపోయాలని హైకమాండ్ అనుకుంటోందట. ఈ క్రమంలోనే తెలంగాణలో సైతం ప్రియాంకను కీలకంగా మార్చారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే ప్రియాంక తెలంగాణలో పర్యటించారని సమాచారం. ఆసక్తికర విషయం ఏంటంటే.. మున్ముందు ఆమెను తెలంగాణ ఇన్‌చార్జిగా కూడా నియమించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అలాగే ఇంత కాలం అటా ఇటా అంటూ ఊగుతూ వస్తున్న బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా తమ ద్వైదీ భావానికి స్వస్తి చెప్పి కాంగ్రెస్ గూటికి చేరాలన్న కృత నిశ్చయానికి వచ్చేశారని చెబుతున్నారు. వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందంటున్నారు. ఈ నెల 25న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్ గూటికి చేరుతారని చెబుతున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం బీఆర్ఎస్ ను, బీజేపీని డీలా పడేటట్లు చేస్తే కాంగ్రెస్ లో మాత్రం కొత్త ఊపు, ఉత్సాహానికి కారణమైందని అంటున్నారు. ఇక కాంగ్రెస్ శ్రేణులు అయితే ఈ సారి తెలంగాణలో తమ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి ఆశలన్నీ ప్రియాంకా గాంధీపైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఆమె పోటీకి దిగడం ఖాయమన్న ప్రకటన వెలువడితే.. రాష్ట్రంలో రాజకీయాలు కాంగ్రెస్ అనుకూలంగా చాలా వేగంగా మారిపోతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-congress-incharge-priyanka-25-156384.html