తెలంగాణ కాంగ్రెస్‌లో సవతుల పోరు నడుస్తోంది.. సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్..!
Publish Date:Aug 21, 2026
Advertisement
రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుంది.. ! తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో వర్గపోరు తీవ్రస్థాయికి చేరిందని, అది కాస్త సవతుల పోరును తలపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీలోని నాయకుల మధ్య ఉన్న విభేదాలే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు మళ్లీ రాజకీయంగా పుంజుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పాలనా తీరు రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ నారాయణ కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ వహించి పాలనను సరిదిద్దాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఉన్నప్పుడే మంత్రులతో పాటు కిందిస్థాయి అధికారుల్లోనూ బాధ్యతాయుతమైన భయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న పలు అక్రమాలు, ప్రజా సమస్యలను నారాయణ ఎత్తిచూపారు. ముఖ్యంగా 22ఏ భూముల నిబంధనలను కొందరు తమ స్వార్థం కోసం తీవ్రంగా దుర్వినియోగం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన కరువైందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో తమకున్న అనుబంధంపై మాట్లాడిన నారాయణ, తమ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి కాదని స్పష్టత ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం సీట్ల సర్దుబాటు కోసమే పొత్తు పెట్టుకున్నామని గుర్తుచేశారు. సీపీఐ పక్షాన తాము ఇస్తున్న ప్రజానుకూల సూచనలను, సలహాలను కాంగ్రెస్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రజల్లో మెల్లమెల్లగా అసంతృప్తి పెరుగుతోందని ఆయన హెచ్చరించారు. ఈ తరహా ధోరణి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ గ్రాఫ్ మరింత పడిపోయే ప్రమాదం ఉందన్నారు. మిత్రపక్షాల అభిప్రాయాలను గౌరవిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. పాలనలో పారదర్శకత పెంచి, అంతర్గత విభేదాలకు స్వస్తి పలకకపోతే మున్ముందు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. Telangana Congress, CPI, 22A lands, TPCC President Mahesh Kumar Goud, CM Revanth reddy, Telangana Politics
http://www.teluguone.com/news/content/telangana-congress-36-229468.html





