ఢిల్లీ వార్ రూమ్ లో సీనియర్ల ఫైటింగ్..తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చరచ్చ
Publish Date:Nov 13, 2021
Advertisement
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణ కాంగ్రెస్ లో మొదలైన రచ్చ మరింత ముదురుతోంది. కొంత కాలంగా సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వల్లే హుజురాబాద్ లో పార్టీకి డిపాజిట్ రాలేదని కొందరు సీనియర్లు ఆరోపించారు. ఈటల రాజేందర్ కు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయారని మరికొందరు వ్యాఖ్యానించారు. తమపై వస్తున్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి టీమ్ మాత్రం సైలెంట్ గానే ఉండిపోయింది. తాజాగా ఢిల్లీలో టీకాంగ్రెస్ నేతల వర్గపోరు బయటపడింది. హుజురాబాద్ ఫలితంపై పోస్ట్ మార్టమ్ నిర్వహించేందుకు కాంగ్రెస్ హైకమాండ్.. తెలంగాణ పీసీసీ నేతలను ఢిల్లీకి పిలిపించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పార్టీ ముఖ్య నేతలంతా హస్తిన వెళ్లారు. ఈ సందర్భంగా ఏఐసీసీ వార్ రూమ్ లో జరిగిన భేటీ రచ్చరచ్చగా మారిందని తెలుస్తోంది. రాహుల్ గాంధీ సన్నిహితుడు కేకే వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై.. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమన్వయ లోపమే పార్టీ ఘోర ఓటమికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన ఇద్దరు పీసీసీ అధ్యక్షులు కే కేశవరావు, డీ శ్రీనివాస్‌లు రాజ్యసభ సభ్యులయ్యేందుకు కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన సోదరుడు కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు అడ్డుతగలడంతో దమ్ముంటే పార్టీ నుంచి తనను సస్పెండ్‌చేయాలంటూ పొన్నం సవాల్ విసిరారు. ఉపఎన్నిక ఇన్చార్జ్గా తనను బాధ్యుడిని చేసే విమర్శలు అర్థరహితం అంటూ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
http://www.teluguone.com/news/content/telangana-cong-leaders-fighting-in-aicc-war-room-over-huzurabad-result-39-126305.html





