అప్పు పుడితేనే పూట గడిచేది ఏపీతో పోటీ పడుతున్న తెలంగాణ
Publish Date:May 31, 2022
Advertisement
రేపు ( బుధవారం) జూన్ 1. అంటే, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల రోజు, కానీ రేపు జీతాలు రావు. రేపే కాదు, ఎల్లుండి, జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, రోజున కూడా జీతాలు పడవు. ఉద్యోగుల జీతాలు మాత్రమే కాదు. పెన్షనర్ల ఖాతాల్లోనూ పెన్షన్ పైసలు పడవు. రైతుల ఖాతాల్లో ఈ నెలలో జమ కావలసిన, ‘రైతుబంధు’ పైసలు కూడా డౌటే, అంటున్నారు. నిజానికి, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థతి రావడం ఇదే మొదటిసారి కాదు. గత కొంతకాలంగా, ఏ నెలలోనూ జీతాలు సకాలంలో రావడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఒక్కొక డిపార్టుమెంట్’కు ఒక్కొక్క రోజు, ఒక్కొక జిల్లాకు ఒక్కొక్క రోజు ఇలా ఇంచుమించుగా నెలంతా డతల వారిగా జీతాల వితరణ జరుగుతూనే ఉందని ఉద్యోగులు అంటున్నారు. నిజానికి, రాష్ట్ర ప్రభుత్వమే ధనిక రాష్ట్రంగా ప్రచారం చేసుకుంటున్న తెలంగాణలో, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ఎవరూ ఉహించి ఉండక పోవచ్చును. కానీ,ఇప్పడు అది కాదనలేని నిజం. రాష్ట్ర ప్రభుత్వాలు హద్దులు దాటి, ఎఫ్ఆర్బీఎం పరిమితులను అతిక్రమించి విపరీతంగా అప్పులు చేస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ( ఆర్బీఐ) రాష్ట్రాల అప్పులపై కొరడా ఝుళిపించింది. ఆదాయం లేని కార్పొరేషన్ల పేరున, ప్రభుత్వ పూచికత్తుతో చేసిన అప్పులను కూడా ఎఫ్ఆర్బీఎం పరిధిలో చేర్చింది. అదనపు అప్పుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పని సరి చేసింది. నిజానికి, ఇది కొత్తగా చేసిన చట్టమో, చట్ట సవరణో కాదు, ఎఫ్ఆర్బీఎం చట్టం 2003లోనే ఈ నిబంధన కూడా వుంది. అయితే, ఇంతకాలం చూసి చూడనట్లు వదిలేసిన నిబంధనలను పకడ్బందిగా అమలు చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరకాటంలో పడ్డాయి. దీంతో ఇంతవరకు అప్పుల ఇంధనంతో సర్కార్ బండి నడిపిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అప్పులకు కేంద్రం నుంచి అనుమతుల కోసం అనేక ప్రయత్నాలు అయితే చేస్తోంది, పడరాని పాట్లు పడుతోంది. ఆంధ్ర ప్రదేశ్’తో పోటీపడి తెలంగాణ అర్తిఅక్ శాఖ అధిఅక్రులు ఢిల్లీలో మకాం చేసి,కేంద్ర ఆర్థిక సఖ అధికారులను ఒప్పించేందుకు సత విధాల ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తోంది. కానీ. ఫలితం అయితే లేదు. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆరాష్ట్ర స్టేట్ జీఎస్డీపీలో 25 శాతం మేరకు మాత్రమే అప్పు చేసే వెసులు బాటు ఉంటుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 38 శాతానికి పైగానే అప్పులు చేసింది. ఈ కారణంగా తెరాస ప్రభుత్వం అదనపు అప్పు అనుమతి కోసం చేసిన అభ్యర్ధనను, కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. అధికారుల నిరీక్షణ కొనసాగుతోంది. దీంతో నిధుల సర్దుబాటు రాష్ట్ర సర్కార్‌కు సంక్లిష్టంగా మారింది. కారణాలు ఏవైనా, రుణాలు పొందేందుకు రాష్ట్ర ప్రభత్వానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అప్పులు ఆగిపోయి అధిఅక్రుల చేతులకు పనిలేకుండా పోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖల సంప్రదింపులు కొనసాగుతున్నా ఈ అంశం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో జూన్‌లో వేతనాలు చెల్లింపులతో పాటు విధిగా వ్యయం చేయాల్సిన వాటికి నిధుల సమీకరణపై ఆర్థికశాఖ ఆందోళన చెందుతోంది. జూన్‌లోనే సుమారు రూ.20 వేల కోట్లు చెల్లించాల్సినవే ఉండటంతో సర్దుబాటు ఎలా అన్న అంశంపై తర్జనభర్జన పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు, పింఛన్లు, వడ్డీల చెల్లింపులతో పాటు సబ్సిడీలు సహా విధిగా ప్రతినెలా చెల్లింపులు చేయాల్సిన జాబితాలో ఉన్నాయి. వీటికే సుమారు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయి. దీంతోపాటు వానాకాలం రైతుబంధుకు రూ.7600 కోట్లు అవసరమని ప్రభుత్వం ప్రతిపాదించింది. జూన్‌లో రైతు బంధు ఇవ్వడం ద్వారా పెట్టుబడి తోడ్పాటు అందుతుందని భావించిన ప్రభుత్వం నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రానికి ప్రధానంగా పన్నులు, పన్నేతర రాబడి ద్వారా మే నెలలో రూ.10 వేల కోట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ అంచనా వేసింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.1200 కోట్లు, వాణిజ్య పన్నులశాఖ ద్వారా రూ.5500 కోట్లు, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.1100 కోట్లు, కేంద్ర పన్నులవాటా, కేంద్ర పథకాల ద్వారా రూ.1000 కోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా వ్యయం మాత్రం దాదాపు రెట్టింపుగా ఉండనుంది. పన్నేతర రాబడి నామమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో జూన్‌లో విధిగా వ్యయం చేయాల్సిన వాటికి నిధుల సమీకరణపై రాష్ట్ర ఆర్థికశాఖ మల్లగుల్లాలు పడుతోంది. శాఖలవారీగా పన్నురాబడులు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా ఇది నామమాత్రంగానే ఉంది. ఫలితంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలే కీలకంగా మారాయి. మే నెలాఖరులోనైనా రూ.2000 కోట్లను బాండ్ల విక్రయం ద్వారా సమీకరించుకోవాలని భావించినా ప్రయత్నాలు ఫలించలేదు. జూన్ మొదటివారంలో బాండ్ల విక్రయానికి కేంద్రం అనుమతిస్తే రెండు విడతలుగా కనీసం రూ.4000 కోట్లు అంతకంటే ఎక్కువ సమీకరించుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ భావిస్తోంది. దళితబంధు, రైతు బంధు, రైతుబీమా, విద్యుత్ సబ్సిడీలు, ఆసరా, బియ్యం సబ్సిడీ, స్కాలర్‌షిప్‌లు, కల్యాణలక్ష్మిలతో పాటు పలు అభివృద్ధి పథకాలకు నిధులు అవసరం. ఈ నెల కూడా వేతనాలు, పింఛన్ల చెల్లింపుల్లో జాప్యం తప్పేలాలేదని ఆర్థికశాఖ భావిస్తోంది. కేంద్రంతో సంప్రదిస్తున్నా స్పష్టత ఇవ్వడంలేదని రాష్ట్రప్రభుత్వం తరఫున అన్నిఅంశాలను వివరించినా సందిగ్ధం కొనసాగుతుండటంపట్ల ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. జూన్ మొదటివారంలోనైనా స్పష్టత వచ్చేనా అని ఎదురుచూస్తున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-competing-with-ap-in-debts-25-136745.html





