రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తెలంగాణ సీఎం రేవంత్ థ్యాంక్స్ ఎందుకంటే?
Publish Date:Jun 22, 2026
Advertisement
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సోమవారం ( జూన్ 22) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రధాన్యత ప్రాజెక్టులలో ఒకటైన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ణతలు తెలిపారు. అలాగే.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఆదిలాబాద్ లో భారత వాయు సేన ఎయిర్‌పోర్ట్ ను భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామన్న రేవంత్ రెడ్డి.. భారత వాయుసేన టెర్మినల్‌తో పాటు ప్రయాణికుల సౌకర్యార్ధం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్‌తో పాటు కార్గో, ఎంఆర్‌వో , హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా సహకరించాలని ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రికి రేవంత్ విజ్ణప్తి చేశారు. అదే విధంగా పాలమూరు జిల్లా దేవరకద్ర వద్ద డీఆర్‌డీవో, డీఆర్‌డీఎల్ ప్రతిపాదించిన కీలక రక్షణ ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రక్షణ మంత్రిని కోరిన రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధి, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్రంతో సమన్వయంతో ముందుకు సాగుతామని చెప్పారు.
http://www.teluguone.com/news/content/telangana-cm-revanth-thanks-defence-minister-rajnath-singh-36-223758.html





