హస్తినకేగిన సీఎం రేవంత్.. ఎందుకో తెలుసా?
Publish Date:Dec 26, 2025
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సారి హస్తినకు బయలు దేరారు. శుక్రవారం (డిసెంబర్ 26) ఆయన ఢిల్లీకి బయలు దేరారు. ఈ పర్యటన ప్రధాన లక్ష్యం హస్తినలో శనివారం (డిసెంబర్ 27) అక్కడ జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడమే అయినా, ఆ సమావేశం తరువాత రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై ఆయన ఈ భేటీలలో కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఆయన తన ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం (డిసెంబర్ 28)న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలా ఉండగా ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, జీహెచ్ఎంసీ విస్తరణ, ఎమ్మెల్యేల అనర్హత అంశాలపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీయడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుందని అంటున్నారు. వాటికి దీటుగా అధికార కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై గళమెత్తి ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా ఈ సారి సమావేశాలకైనా కేసీఆర్ హాజరౌతారా లేదా అన్న ఆసక్తి కూడా సర్వత్రా వ్యక్తమౌతోంది.
http://www.teluguone.com/news/content/telangana-cm-revanth-delhi-tour-39-211590.html





