కేసీఆర్ స్కెచ్.. ఒకే దెబ్బకి మూడు పిట్టలు..!
Publish Date:Apr 18, 2016
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ దెబ్బకి ఎటు వెళ్లాలో..ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత జగన్‌కు మరో మిత్రుడు షాకివ్వనున్నాడు. ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ నుంచి వైసీపీని పూర్తిగా తుడిచేయడానికి కేసీఆర్ ప్లాన్ రెడీ చేస్తున్నారని సమాచారం. తన ఆకర్ష్ దెబ్బకి ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్‌లను కోలుకోలేని దెబ్బ తీసిన గులాబీ దళపతి, ఇప్పడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. త్వరలో ఎన్నిక జరగనున్న ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. పాలేరు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. 13 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 10 సార్లు గెలిచింది. అంతేకాకుండా ఇక్కడ రాజకీయాలన్ని రెడ్డి సామాజిక వర్గం చుట్టూ నడుస్తాయి. దీని సమీప నియోజకవర్గాల్లో కూడా రెడ్లు అధికం . అందుకే 2014 ఎన్నికల్లో వైసీపీ మూడు ఎమ్మెల్యే స్థానాలతో పాటు, ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుని ఆధిక్యం చూపించింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేల్లో మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు కారెక్కగా..ఇక మిగిలింది ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాత్రమే. వీరిద్దరిని టీఆర్ఎస్‌లో చేర్చుకుంటే తెలంగాణలో వైసీపీ ఖాళీ అవ్వడంతో పాటు ఓ పార్టీని విలీనం చేసుకున్న ఘనత టీఆర్ఎస్‌కే దక్కుతుంది. పాలేరు సీటుతోనే వైసీపీ విలీన ప్రక్రియ ముడిపడి ఉంది. ఇక్కడ జరిగే ఉపఎన్నికలో తన తమ్ముడికి టీఆర్ఎస్ తరపున టిక్కెట్ ఇస్తే తాను పార్టీలో చేరుతానని పొంగులేటి షరతు పెట్టారంట. అయితే ఇక్కడ తన తనయుడు తుమ్మల యుగంధర్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పావులు కదుపుతున్నారంట. అయితే బలమైన రెడ్డి సామాజిక వర్గం అండదండలు లేకుండా ఇక్కడ ఎవరూ ఏమి చేయలేరు. అందుకే పొంగులేటి సోదరుడికి టిక్కెట్ ఇవ్వడానికే కేసీఆర్ మొగ్గు చూపుతారని తెలుస్తోంది. తద్వారా వైసీపీ విలీన ప్రక్రియ, రెడ్డి సామాజిక వర్గం అండదండలు, కాంగ్రెస్‌ను వ్యూహత్మకంగా దెబ్బకొట్టవచ్చు. ఒకే దెబ్బకి మూడు పిట్టలన్న మాట. ఎంతైనా కేసీఆర్ స్కెచ్ మరి. ఇది జరిగితే వైసీపీ లోటస్ పాండ్ నుంచి దుకాణం సద్దేసి విజయవాడలో పెట్టుకోవాల్సిందే.
http://www.teluguone.com/news/content/telangana-cm-kcr-45-58721.html





