తెలంగాణా సిటిజన్ కార్డులు దేనికో
Publish Date:Jul 25, 2014
Advertisement
సాధారణంగా అన్ని దేశాలు తమ పౌరులకు గుర్తింపు కార్డులు ఇస్తాయి. మనదేశంలో ఇప్పటికే చాలా మందికి ఆధార్ కార్డులు ఇవ్వబడ్డాయి. కానీ దేశంలో ఎక్కడాలేని విధంగా కేవలం తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే ‘తెలంగాణా సిటిజన్ కార్డు’లను ఇచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పధకాలలో అవినీతికి తావు లేకుండా అర్హులయిన వారికే ప్రభుత్వ పధకాల వల్ల లబ్ది కలిగేలా చేయడం ఈ కార్డుల ప్రధానోదేశ్యం అని ప్రభుత్వం చెపుతోంది. నిజంగా అవి అందుకొరకే అవి నిర్దేశించబడినట్లయితే, వాటిని తెలంగాణా సిటిజన్ కార్డులని అనడం తప్పు. కానీ ఆవిధంగా పేర్కొనడం ద్వారా రాష్ట్రంలో తెలంగాణా ప్రజల నుండి ఇతరులను అంటే బహుశః తెలంగాణాలో స్థిరపడిన ఆంద్ర ప్రజలను, వారి పిల్లలను విడదీసి ప్రత్యేకంగా గుర్తించడానికేనని అర్ధమవుతోంది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం తెరాస నేతలు తెలుగు ప్రజల మద్య విద్వేషాలు రెచ్చగొట్టి వారిని దూరం చేసారు. ఇప్పుడు ఈ తెలంగాణా సిటిజన్ కార్డులు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణేతరులందరిపై సెకండ్ క్లాస్ సిటిజన్లుగా ప్రభుత్వమే ముద్ర వేసినట్లుఅవుతుంది. దేశ సమగ్రతను కాపాడవలసిన బాధ్యత ఏ ఒక్కరిమీదో ఉండదు. దేశంలో యావత్ ప్రజలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు కృషి చేయాలి. కానీ స్వయంగా ప్రభుత్వమే ప్రజలను ఈ విధంగా విభజించాలని ప్రయత్నించడం హర్షణీయం కాదు. రాష్ట్ర విభజన కోసం ఉద్యమాలు జరుగుతున్నపుడు తెరాస నేతలు తామేమీ దేశం నుండి విడిపోతామని కోరడం లేదు కదా? అని ప్రశ్నించేవారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు తెలంగాణా ప్రజలకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే ఆలోచనను ఏమనుకోవాలి? ప్రభుత్వ పధకాలు నిజమయిన, అర్హులయిన లబ్దిదారులకు చేర్చేందుకు గుర్తింపు కార్డులు జారీ చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆ పేరుతో ప్రజల మధ్య దూరం పెంచడాన్ని మాత్రం ఎవరూ హర్షించరు. రాష్ట్రం విడిపోయినా తెలంగాణాలో స్థిరపడినవారి పట్ల ఎటువంటి వివక్ష ఉండబోదని, రాష్ట్రాలుగా విడిపోయి తెలుగు ప్రజలు అందరూ అన్నదమ్ములా కలిసి ఉందామంటూ తెరాస నేతలు చాలా మంచి మాటలే చెప్పారు. కానీ అవ్వన్నీ ఇప్పుడు పూర్తిగా మరిచిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-citizen-cards-45-36471.html





