స్పీకర్ పోచారంకు కరోనా.. కేసీఆర్, జగన్ శిబిరంలో టెన్షన్
Publish Date:Nov 25, 2021
Advertisement
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెగ్యులర్ మెడికల్ టెస్ట్‌లో భాగంగా బుధవారం రాత్రి ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే స్పీకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యానని తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు, సన్నిహితులు వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకుని, హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. గత ఆదివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డికి, ఏపీ సీఎం ఓఎస్టీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌రెడ్డితో ఘనంగా వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివాహ వేడుకలో ఎంతో ఉత్సాహంగా కనిపించిన పోచారం.. అతిథులందరినీ ఆప్యాయంగా పలకరించి మర్యాదలు చేశారు. స్పీకర్ పోచారంతో సీఎం జగన్, సీఎం కేసీఆర్ లు మాస్కులు లేకుండానే సగుసలాడారు. చాలా సేపు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుతున్నారు. స్పీకర్ పోచారంకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల్లో ఆందోళన నెలకొంది. పోచారంకు కరోనా సోకడంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. కేసీఆర్‌కు గతంలో కరోనా సోకగా.. జగన్ కోవిడ్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన రెండు డోసుల టీకాలు వేయించుకున్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ఇటీవల కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
http://www.teluguone.com/news/content/telangana-assembly-speaker-pocharam-srinivas-reedy-tested-covid-positive-39-127087.html





