పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం.. వ్యతిరేకించిన ఎంఐఎం!!
Publish Date:Sep 8, 2020
Advertisement
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసిఆర్ అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ అని కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ మన ఠీవి అని, దక్షిణాది నుంచి తొలిసారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన రాజనీతజ్ఞుడు అని తెలిపారు. గ్లోబల్ ఇండియా నిర్మాత పీవీ అని, దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పీవీ ప్రధాని అయ్యారని కేసీఆర్ తెలిపారు. పీవీ అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశం పురోగమించడానికి మూలకారకుడు పీవీనే అని, నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా భారతదేశం నిలిచేందుకు పీవీ సంస్కరణలే కారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పీవీ నాటిన సంస్కరణ ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నామని సీఎం తెలిపారు. మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రి చేసిన ఘనత పీవీది అని పేర్కొన్నారు. భూ సంస్కరణలకు పీవీనే నాంది పలికారని గుర్తుచేశారు. తన సొంత భూమి 800 ఎకరాలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని కొనియాడారు. దేశ ప్రగతికి ఉజ్వలమైన బాటలు వేసిన మహన్నోత దార్శనికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీకి 'భారతరత్న' ఇవ్వాలని, ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ ప్రకటన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతేకాకుండా, పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్న ప్రతిష్టించాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరుపెట్టాలని కోరుకుంటున్నట్టు సీఎం కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి మద్దతిస్తున్నామని తెలిపారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సంక్షోభాల సమయంలో చాకచాక్యంగా పీవీ పాలన చేశారని కొనియాడారు. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అయితే, పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ సభలో నిర్వహించిన చర్చకు ఎంఐఎం పార్టీ దూరంగా ఉంది. ఈ చర్చకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.
http://www.teluguone.com/news/content/telangana-assembly-passes-unanimous-resolution-demanding-bharat-ratna-for-pv-narasimha-rao-39-103824.html





