తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో 9 మంది మృతి
Publish Date:Apr 22, 2025
Advertisement
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతతో తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బ తగిలి సోమవారం ఒక్కరోజే 9 మంది మృతి చెందారు. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొన్నాది. గరిష్ఠంగా 44-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని అధికారులు తెలిపారు. ఇక వడదెబ్బ కారణంగా ఖమ్మం, కరీంనగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్కరు, ఉమ్మడి ఆదిలాబాద్‌లో ముగ్గురు, వరంగల్‌లో ముగ్గురు మరణించారు. ఇక కామారెడ్డి జిల్లా బిచ్కుందలో సోమవారం అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒకవైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత భయపెట్టగా.. సాయంత్రం వేళ అకస్మాత్తుగా కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎండలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు పుష్కలంగా నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. మసాలా ఫుడ్స్ కాకుండా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యులు పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/telangana-39-196716.html





