తేజ్ పాల్ విషయంలో పోలీసుల అత్యుత్సాహం
Publish Date:Dec 2, 2013
Advertisement
తెహల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ విషయంలో గోవా పోలీసుల తీరు మరీ అతిగా ఉంది. 50ఏళ్ల వయసున్న అతనికి ఈరోజు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అతను మహిళా విలేఖరితో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వయంగా మీడియా ముందు అంగీకరిస్తున్నట్లు చేసిన ప్రకటన, తనను క్షమించమంటూ సదరు అమ్మాయికి ఈమెయిల్ ద్వారా పంపిన లేఖ రెండూ కూడా ఆయనను దోషిగా నిరూపిస్తున్నాయి. తన నేరం అంగీకరించిన అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నాక చట్ట ప్రకారం విచారించి అతనిపై కేసు నమోదు చేసి తగిన శిక్ష పడేట్లుచేసే బదులు, అతనికి లైంగిక పటుత్వ పరీక్షలు చేయడం, ఆ సంగతి మీడియా ద్వారా లోకమంతా తెలిసేలా చేయడం చూస్తుంటే, అది అతనిని, మానసికంగా దెబ్బతీసి అతని పరువు ప్రతిష్టలను పూర్తిగా దెబ్బ తీసేందుకేనని అర్ధం అవుతోంది. అతను గతంలో బండారు లక్ష్మణ్ పై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, బీజేపీ హయాంలో జరిగిన ఆయుధాల కొనుగోళ్ళ వ్యవహారంలో గుట్టు బయటపెట్టారు. ఆ తరువాత ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాజనంద్ గావ్ అనే ప్రాంతంలో ఉన్న ఒక నదిపై హక్కులను ఒక స్థానిక పారిశ్రామిక వేత్తకు దఖలుపరచడం వంటి అనేక లోగుట్టులను తెహల్కా పత్రిక బయటపెట్టింది. బహుశః ఆ కక్షతోనే ఇప్పుడు గోవాలోని బీజేపీ ప్రభుత్వం అతనిపై పగ తీర్చుకొంటున్నట్లుంది. లేకుంటే, అసలు ఈ కేసుకి ఇంత ప్రాధాన్యం ఇచ్చేదే కాదు. నేరం అంగీకరించిన వ్యక్తికి శిక్షపడేలా చేయడం కంటే, అతనిని మానసికంగా, సామాజికంగా దెబ్బ తీయాలని గోవా పోలీసుల తాపత్రయం ఎక్కువ కనిపిస్తోందిపుడు. అవసరమయిన మేరకు విచారణ చేసి అతనికి తగు శిక్షపడేలా చేయాల్సినపోలీసులు, కోర్టులు విదించబోయే జైలు శిక్ష కంటే కటినమయిన నరకం అతనికి చూపిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో పోలీసులు అతిగా వ్యవహరిస్తే, వారు కూడా కోర్టు కేసులలో చిక్కుకోవడం ఖాయం. పోలీసులు తీరు ఈ కేసులో బాదితురాలయిన మహిళా విలేఖరికి న్యాయం చేస్తున్నట్లుగాక, రాజకీయ ఉద్దేశ్యంతోనే వ్యవహరిస్తునట్లుంది. అంటే అసలు విషయం వదిలి పక్కదారిపడుతున్నారన్న మాట!
http://www.teluguone.com/news/content/tehalka-39-27976.html





