ఎస్పీ కార్యాలయంలో బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యే.. పది గంటల హైడ్రామా
Publish Date:Mar 31, 2026
Advertisement
పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఎస్పీ కార్యాలయంలో ఏకంగా పది గంటల పాటు బైఠాయించి సంచలనం సృష్టించారు. పల్పాడు జిల్లా పోలీసు లీగల్ సలహాదారుగా తాను రికమెండ్ చేసిన వ్యక్తిని వెంటనే నియమించాలంటూ ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి ఏకంగా పది గంటల పాటు హల్ చల్ చేశారు. ఎమ్మెల్యే తీరుపై తెలుగుదేశం అధిష్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయమేంటంటే.. పల్నాడు జిల్లా పోలీసు విభాగం సలహాదారుగా చదలవాడ అరవిందబాబు రామినేని ప్రసాద్ ను నియమించాలని ఎనిమిది నెలల కిందట సిఫారసు చేశారు. ఆ విషయంలో ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన స్వయంగా మంగళవారం (మార్చి 31) ఉదయం పదకొండున్న గంటల సమయంలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ బి.కృష్ణారావును కలిశారు. ఆయన విచారణ జరిపి ఉత్తర్వులిస్తానని చెప్పారు. అయితే ఎమ్మెల్యే చదలవాడ మాత్రం నియామక పత్రం చేతికిచ్చే వరకు కదిలేది లేదని ఎస్పీ ఛాంబర్‌లోనే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎస్పీతో ఆయన తీవ్ర వాగ్వాదానికి పాల్పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎస్పీ చాంబర్ లోనే కూర్చున్న ఎమ్మెల్యే ఒక దశలో ఆ చాంబర్ లోని బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. మంత్రులు నారా లోకేశ్, అనిత కార్యాలయాల నుంచి ఫోన్లో మాట్లాడినా ఆయన బయటకు రాలేదు. దీంతో పోలీసులు డంబెల్స్‌తో బాత్రూం డోర్ పగలగొట్టి ఆయన్ను బయటకు తీసుకువచ్చారు. చివరకు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఇతర తెలుగుదేశం నేతలు వచ్చి బుధవారం (ఏప్రిల్ 1) సాయంత్రంలోగా నియామక ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు శాంతించారు. రాత్రి తొమ్మదిన్నర గంటల ప్రాంతంలో ఆయన తన నిరసర విరమించారు.
http://www.teluguone.com/news/content/tdp-mla-staged---sitin-at-sp-office-25-216490.html





