తెలుగుదేశం,జనసేన పొత్తు ఖరారు.. సీట్ల సర్దుబాటూ కొలిక్కి?.. జనసేన పోటీ చేసే స్థానాలేమిటంటే?
Publish Date:Jan 5, 2023
Advertisement
ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమైపోయిందా? బీజేపీ కలిసినా కలవకపోయినా తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు ఖరారైపోయిందా? అంటే ఈ రెండు పార్టీల శ్రేణుల నుంచీ కూడా ఔననే సమాధానం వస్తోంది. ఎన్నికలు ఇంకా బోలెడు సమయం ఉన్నా.. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. దానికి తోడు ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశాయని చెబుతున్నారు. ఏవో రెండు మూడు జిల్లాలు వినా దాదాపుగా అన్ని జిల్లాలలోనూ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు కూడా ఖరారైపోయాయని చెబుతున్నారు. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో జనసేన బలం పెరిగిందన్న విషయాన్ని ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. హీరోగా, పొలిటీషియన్ గా జనసేనాని పవన్ కల్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలోనే ప్రజలు ఆయన సభలకు హాజరౌతున్నారు. తెలుగు రాష్ట్రాలలో అత్యంత జనాకర్షణ సామర్థ్యం ఉన్న వారిలో పవన్ కల్యాణ్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. అయితే ఈ జనాకర్షణ ఎన్నికలలో విజయానికి దోహదపడుతుందా అంటే మాత్రం కచ్చితంగా ఔనన్న సమాధానం రాదు. గత ఎన్నికలలో 130కి పైగా స్థానాలలో పోటీ చేసిన జనసేన కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించింది. ప్రస్తుతం కూడా ఆ పార్టీకి జనాదరణ పెరిగినా ఒంటరిగా ఎన్నికల సమరాంగణంలో గెలిచే సామర్థ్యం మాత్రం లేదనే చెప్పాలి. ఇందుకు కారణాలెన్నో ఉన్నా.. ప్రధానంగా పార్టీ ఆవిర్భవించి పుష్కర కాలం గడిచినా ఇప్పటికీ సంస్థాగత నిర్మాణం లేదు. అలాగే పవన్ కల్యాణ్ వినా మరో నాయకుడు కనిపించరు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ అంతే. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నా.. ఆయన క్రౌడ్ పుల్లర్ కాదు. వీరిద్దరినీ మినహాయిస్తే మిగిలిన వారంతా ఆటలో అరటి పండుతో సమానం. పవన్ కళ్యాణ్ ఒంటరి నాయకత్వం వలన పార్టీ జనంలోకి బలంగా వెళ్ళలేక పోతోంది. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పుడు ఆయన పార్టీ నిర్మాణంపై దృష్టి సారించింది. గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకూ పార్టీ నిర్మాణం చేశారు. శిక్షణా శిబిరాలు నిర్వహించి, సభ్యత్వాలు నమోదుపైనా దృష్టి సారించారు. ఆ తరువాత పార్టీలో చంద్రబాబు కార్యకర్తల వివరాలు, పార్టీ కార్యక్రమాలను కంప్యూటరైజ్ చేశారు. శిక్షణా శిబిరాలను కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లారు. ఇప్పుడు ఎన్టీఆర్ లేకపోయినా, టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉండటానికి అదే కారణం. అందుకే టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. రాజకీయాల్లో తన గుర్తింపు చాటుకుని, స్థిరంగా నిలిచింది. ఏ రాజకీయ పార్టీ అయిన పదికాలాలు నిలవాలంటే, సంస్థాగత నిర్మాణం అవసరం. అది లేక పోవడమే జనసేన లోపం. ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగితే, 2019 ఫలితాలే పునరావృతం అవుతాయి.అంతే కాదు, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఫలితంలో మార్పు ఉండదు. బీజేపీ దేశంలో బలమైన శక్తి కావచ్చును, కానీ, ఆంధ్ర ప్రదేశ్’లో మాత్రం బీజేపీకి నిండా ఒక శాతం ఓటు బలం కూడా లేదు. అందుకే వైసీపీని ఓడించే శక్తి ఒక్క టీడీపీకి తప్ప మరో పార్టీకి లేదు. సో .. వైసీపీని ఓడించి, జగన్ రెడ్డి పాలనకు ముగింపు పలకడమే జనసేన లక్ష్యం అన్న పవన్ కళ్యాణ్ ముందున్న ఏకైక ఆప్షన్ తెలుగుదేశం పార్టీతో అవగాహన కుదుర్చుకోవడం ఒక్కటే. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా వచ్చే ఎన్నికలలో ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ గెలుపును అడ్డుకోవాలన్న లక్ష్యం నెరవేరాలంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న జనసేన పార్టీతో పొత్తు తెలుగుదేశం పార్టీకీ అవసరమే. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల మధ్యా పొత్తు పొడుపుకు మార్గం సుగమమయ్యేలా చర్చల ప్రక్రియకు తెరలేచింది. అందులో భాగంగానే ఇప్పటికే చాలా వరకూ ఒక అవగాహన కుదిరింది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఇప్పిటికే ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు కూడా చాలా వరకూ ఖరారైందని చెబుతున్నారు. పొత్తులో భాగంగా ఏడు జిల్లాలలో 20 స్థానాలలో జనసేన పోటీ చేస్తుందని చెబుతున్నారు. మిగిలిన జిల్లాలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అవగాహన కుదిరిన స్తానాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లాలో తెనాలి, సత్తెన పల్లి, కృష్ణా జిల్లాలో పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్, తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, పి. గన్నవరం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలోనూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్ల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాలలోనూ జనసేన అభ్యర్థులు రంగంలో ఉంటారు. ఇక విశాఖ జిల్లాలో పెందుర్తి, భీమిలి, గాజువాక, చోడవరం నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు లేదా తిరుపతిలో పొత్తలో భాగంగా జనసేన పోటీ చేస్తుంది. ప్రకాశం జిల్లా లోని దర్శి, గిద్దలూరు స్థానాలను తెలుగుదేశం జనసేనకు కేటాయించింది. నెల్లూరు, విజయనగరం, అనంతపురం జిల్లాలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయి. మొత్తం మీద వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనల పొత్త ఖాయమని ఆ రెండు పార్టీలూ కూడా ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నాయి.
http://www.teluguone.com/news/content/tdp-janasena-alliance-sure-39-149567.html





