రాజకీయ అవతారం ఎత్తిన సివిల్ సర్వెంట్స్
Publish Date:Jan 5, 2023
Advertisement
చిన్న పిల్లలను పెద్దయ్యాక ఏమవుతావు, అంటే ఒకడు డాక్టర్ అంటాడు ఇంకొకడు యాక్టర్ అవుతానంటాడు ... ఇంకొకడు ఇంజినీర్ మరొకరు లాయర్ అంటాడు. ఇంకోడు టీచర్, సివిల్ సర్వెంట్ (ఐఎఎస్, ఐపీఎస్,ఐఎఫ్ఎస్) సైంటిస్ట్, ఇంకా అదో ..ఇదో ఇంకేదో అవుతానని అంటారు. కానీ, రాజకీయ నాయకుడు అవుతాననే వాళ్ళు మాత్రం చాలా చాలా తక్కువగా కోటికొక్కరుగా ఉంటారు. కానీ,చివరకు నదులన్నీ సముద్రంలో కలుస్తాయి అన్నట్లుగా... డాక్టర్లు, యాక్టర్లు, ఐఎఎస్, ఐపీఎస్ లుఇతర ఉన్నత పదవుల్లో ఉన్నవారు చివరకు న్యాయమూర్తులు, ఒకరని కాదు, సహస్ర వృత్తుల సెలబ్రిటీలు చాలా వరకు అవకాశం చిక్కితే రాజకీయ అరంగేట్రం చేసేందుకు రెడీ అయిపోతుంటారు. అందరి విషయం ఎలా ఉన్నా, సివిల్ సర్వెంట్ల విషయం కొంచెం చాలా భిన్నంగా ఉంటుంది. సివిల్ సర్వెంట్ కావడమే జీవిత ఆశయంగా అహోరాత్రులు కష్ట పడతారు. ఒక విధంగా ఒక తపస్సులా, ఒక మహా యజ్ఞంల కష్టపడి సివిల్ సర్వీసెస్ పూర్తి చేస్తారు. అయితే అంత కష్టపడి చేరుకున్న గమ్యం నుంచి కొందరు సివిల్ సర్వెంట్స్ కొంత కాలం తర్వాతనే కావచ్చును రాజకీయలపై మనసు పారేసుకుంటారు. ఎమ్మెల్యే, ఎంపీ కాలం ఖర్మం కలిసొస్తే మంత్రి, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అయితే అలాంటి కోరిక ఎంత మందిలో ఉన్నా అటు సివిల్ సర్వెంట్స్ గా ఇటు రాజకీయ నాయకుడిగా జోడు గుర్రాల స్వారీ చేసి సక్సెస్ అయిన వారు కొద్ది మందే కనిపిస్తారు. అందులో మన జీపీ, జేడీ లక్ష్మినారాయాణ,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి కొందరు ఉన్న ఉద్యోగం వదులుకుని రాజకీయ అరంగేట్రం చేస్తే, మాజీ మంత్రి విజయరామ రావు, మాజీ ఐఏఎస్ అధికారి ఐవీఆర్ కృష్ణా రావు వంటి కొందరు మరి కొందరు పదవీ విరమణ చేసిన తర్వాత, సెకండ్ ఇన్నింగ్స్ లో రాజకీయ అరంగేట్రం చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడొక సారి అలా జాతీయ రాజకీయాల్లో ప్రముఖ భూమిక పోషించిన మాజీ సివిల్ సర్వెంట్స్...ఎవరని చూస్తే, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ముందుగా వినిపిస్తుంది. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లోప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన యశ్వంత్ సిన్హా 1960లో ఐఏఎస్ ఆఫీసర్ గా ప్రభుత్వ విధుల్లో జాయినయ్యారు. 1984 వరకు వివిధ హోదాల్లో ప్రభుత్వ అధికారిగా కొనసాగారు. ఆ తర్వాత జనతాదళ్ లో చేరారు .. ప్రధాని చంద్రశేఖర్ మంత్రి వర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. చంద్రశేఖర్ ప్రభుత్వం పడిపోయిన వెంటనే బీజేపీలోకి జంప్ చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేశారు. 2018లో బీజేపీకి రాజీనామా చేశారు. చివరకు తృణమూల్ కాంగ్రెస్ లో చేరి రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే ముందు, తృణమూల్ కు రాజీనామా చేశారు. అలాగే లోక్ సభ మాజీ స్పీకర్, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రాం కుమార్తె మీరా కుమార్, 1973లో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా జీవితాన్ని ప్రారంభించారు. 1985లో రాజకీయాల్లో ప్రవేశించారు. నాలుగు పర్యాయాలు లోక్ సభకు ఎన్నికైన ఆమె 2004 నుంచి 2009 వరకు కేంద్ర మంత్రిగా, 2009 నుంచి 2014 వరకు లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. తొలి మహిళా స్పీకర్ అన్న ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయినా గణనీయ స్థాయిలో అంతవరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిన అభ్యర్ధులలో అత్యధిక ఓట్లు సాధించినవారిలో మూడవ స్థానంలో నిలిచారు. మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కూడా మూడు దశాబ్దాలకు పైగా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా పనిచేశారు. 1953లో ఐఎఫ్ఎస్ లో చేరిన ఆయన 31 సంవత్సరాలు సర్వీస్ లో కొనసాగారు. 1984 పదవీ విరమణ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా అమెరికా, చైనా రాయబారి సహా పలు కీలక బాధ్యతలు నిర్వహించిన నట్వర్ సింగ్, రాజస్థాన్ లోని భరత్ పూర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుత మంత్రి వర్గంలో విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కూడా ఐఎఫ్ఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 1977లో భారత విదేశాంగ సేవ అధికారిగా ప్రభుత్వోద్యోగంలో చేరిన జయశంకర్ 2014-2015 సంవత్సరాల్లో అమెరికా 2009-2013 చైనాలో 2001-04 చెక్ రిపబ్లిక్ లో భారత రాయబారిగా పనిచేశారు. 2007-09లో సింగపూర్ దేశానికి భారత హై కమిషనర్ గా పనిచేశారు. ఇండో-అమెరికన్ అణు ఒప్పందానికి సంబంధించిన సంప్రదింపుల్లో కీలక పాత్ర పోషించారు. 31 మే 2019 నుండి భారత ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నారు. 2019 జులైలో గుజరాత్ నుంచి రాజ్యసభ కు ఎన్నికయ్యారు. అంతకు ముందు జయశంకర్ 2015 నుండి జనవరి 2018 వరకు విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుత మోడీ కాబినెట్ లో జయశంకర్’తో పాటుగా మరో ముగ్గురు మాజీ సివిల్ సర్వెంట్స్ కూడా మంత్రులుగా కొనసాగుతున్నారు. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పూర్వశ్రయంలో ఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేశారు. 1974లో సర్వీస్ లో చేరిన ఆయన యుకే, బ్రెజిల్ దేశాలలో భారత రాయబారిగా పనిచేశారు. అలాగే ప్రస్తుత కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజ కుమార్ కౌర్, బీహర్ క్యాడర్ కు చెందిన 1975 బ్యాచ్, ఐఏఎస్ ఆఫీసర్. గతంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రాజ్ కుమార్ 2013లో బీజేపీలో చేరారు. అలాగే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన 1980 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ముంబై పోలీస్ కమీషనర్ గా పనిచేసిన సింగ్ 2014 లో ఉద్యోగానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. బఘ్పాట్ లోక్ సభ స్థానం నుంచి వరసగా రెండుసార్లు విజయం సాధింఛి, కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. ఇక ముఖ్యమంత్రులైన సివిల్ సర్వెంట్స్ విషయానికి వస్తే, ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ, ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సమయంలోనే ఆనాటి ప్రధాని రాజీవ గాంధీ దృష్టిని ఆకర్షించారు. రాజీవ్ గాంధీ ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాలంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఒకప్పుడు గాంధీ కుటుంబ లాయలిస్ట్ గా మెలిగిన జోగీ అవినీతి ఆరోపణలు కారణంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. చివరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి, ఛత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ పేరిట ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే అనారోగ్యం కారణంగా జనతా కాంగ్రెస్ జనంలోకి వెళ్ళలేదు. ఇక ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. ఇండియన్ రెవిన్యూ సర్వీస్ ( ఐఆర్ ఎస్) ఆఫీసర్ గా పనిచేసిన అరవింద్ కేజ్రివాల్, సామాజిక కార్యకర్త అన్నా హజారే, అవినీతి వ్యతిరేక లోక్ పాల్ ఆందోళన వేదికగా రాజకీయ అరంగేట్రం చేశారు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని స్థాపించారు. 2013 నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాగా 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. నిజానికి, కేజ్రివాల్ ప్రధాని రేస్ లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వేళ ఆయన కల ఫలిస్తే పీఎం పదవి చేపట్టిని సెకండ్ సివిల్ సర్వెంట్ అవుతారు.. అవును మన్మోహన్ సింగ్ సివిల్ సర్వెంట్ నిర్వచనం పరిధిలోకి రాక పోవచ్చును కానీ సివిల్ సర్వెంట్ పీఎం మన్మోహన్ సింగ్. రిజర్వు బ్యాంకు గవర్నర్ సహా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ పీవీ నరసింహ రావు మంత్రి వర్గంలో 1991 నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా, 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. వీళ్ళే కాదు... కాంగ్రెస్ బహిష్కృత నేత మణి శంకర్ అయ్యర్ మొదలు తాజాగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడిగా నియమించిన తోట చంద్రశేఖర్ వరకు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మాజీ సివిల్ సర్వెంట్ల సంఖ్య భారీగానే ఉంది.
http://www.teluguone.com/news/content/civil-servents-in-politics-39-149573.html





