అమరావతిలో టీడీపీదే ఘన విజయం.. వైసీపీకి ముందంతా ముసళ్ల పండగే..!
Publish Date:Nov 18, 2021
Advertisement
ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తప్పక ఉంటాయి. కాస్త ఆలస్యమైనా చేసిన తప్పులకు శిక్ష తప్పక పడుతుంది. 153 మంది ఎమ్మెల్యేల అధికారం ఉంది కదాని.. రాజధానిని మూడు ముక్కలు చేస్తే.. ఆ పాపం స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో తిరిగి కొడుతోంది. తమకు ఎదురులేదని విర్రవీగుతున్న వైసీపీకి.. రాజధాని ప్రాంత ఓటర్లు ఓటమితో గట్టి గుణపాఠం చెప్పారు. జగన్‌రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలింది. ఫిరంగిపురం మండలంలో రెండు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఆ రెండు చోట్లా వైసీపీ ఓడిపోయింది. టీడీపీ గెలిచింది. గుండాలపాడులో 457 ఓట్లు, వేమవరం 93 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. రాజధానిని మూడు ముక్కలు చేసిన అధికార పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కి పెడన ప్రజలు షాకిచ్చారు. పెడన జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి ఆర్జా నగేష్ 644 ఓట్లతో గెలుపొందారు. పెడన జడ్పీటీసీ ఎన్నికను అత్యంత సవాల్ గా తీసుకున్నారు జోగి రమేష్. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పోలింగ్ రోజుల వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయినా పెడన జడ్పీటీసీగా టీడీపీ గెలుపోదడంతో జోగి రమేశ్ కు షాక్ తగిలింది. పామిడి మండలం గజరాంపల్లి ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి రామలక్ష్మి 202 ఓట్లతో గెలిచారు. వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు ఓటర్లు షాకిచ్చారు. ఎమ్మెల్యే సొంత మండలం శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. 1046 ఓట్లు మెజారిటీతో టీడీపీ అభ్యర్థి హైమావతి గెలిచారు. జడ్పీటీసీ ఎన్నికను మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సవాలుగా తీసుకున్నారు. శావల్యాపురం జడ్పీటీసీగా గెలవడంతో వినుకొండ నియోజకవర్గ టీడీపీ నేతలు నూతనోత్సాహంతో ఉన్నారు. అసలే రాజధాని రైతులు జగన్ ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. అమరావతిని కనుమరుగు చేయాలని చూస్తున్న సర్కారుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 700 రోజులుగా ఉద్యమిస్తున్నా పట్టించుకోని జగన్‌రెడ్డిపై అక్కస్సుతో ఉన్నారు. ఈ సమయంలో వచ్చిన ఎంపీటీసీ ఎన్నికలను మంచి అవకాశంగా భావించారు. ప్రజా వ్యతిరేకతను ముందే గుర్తించిన వైసీపీ.. గుండాలపాడు, వేమవరం స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్వయంగా ప్రచారం నిర్వహించారు. పార్టీ పెద్దలు సైతం పరోక్షంగా సహకరించారు. ఇక బెదిరింపులు, తాయిలాలు మామూలుగా జరగలేదు. ఇంతా చేసినా.. అంత భారీ మెజార్టీతో ఆ రెండు స్థానాల్లో ఓడిపోవడం అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకతను నిదర్శనం. పెడన జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి ఆర్జా నగేష్ 644 ఓట్లతో గెలుపొందారు. ఈ వ్యతిరేకత ఇలానే కంటిన్యూ అయితే.. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ నాటికి రాజధాని ప్రాంతంలో వైసీపీకి చావుదెబ్బ తప్పకపోవచ్చు. ఇంతగా అధికార బలం ప్రయోగించినా, దొంగ ఓట్లతో దౌర్జన్యాలకు దిగినా.. ఈ స్థాయిలో టీడీపీ విజయ ఢంకా మోగిస్తుండటం వైసీపీని కలవరపాటుకు గురి చేస్తుంటే.. భవిష్యత్తుపై టీడీపీ ధీమా రెట్టింపు అవుతోంది.
మరోవైపు, ఏపీ వ్యాప్తంగా వెలువడుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతోంది. పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగిరింది. వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్వగ్రామాల్లో సైతం టీడీపీ గెలుపుబాటన దూసుకుపోతోంది. సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో అనేక చోట్ల హోరాహోరీ పోరు జరిగింది. అనూహ్యంగా అమరావతి సమీపం ప్రాంతాలైన దర్శి, కొండపల్లి మున్సిపాలిటీలను టీడీపీ ఖాతాల్లో వేసుకుంది. జగ్గయ్యపేటలో ఓడినా గెలిచినంత పని చేసింది. కర్నూలు జిల్లాలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నివాసం ఉండే వార్డులోనూ టీడీపీనే గెలవడం మామూలు విషయమా? ఇక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ పలుచోట్ల టీడీపీ హవా కొనసాగుతుండటం వైసీపీలో గుబులు రేపుతోంది.
http://www.teluguone.com/news/content/tdp-grand-victory-in-amaravati-region-25-126639.html





