టీటీడీ సూటుకేసు కంపెనీ కాదు.. తొక్కిసలాటతో సుబ్బారెడ్డిపై తీవ్ర విమర్శలు..
Publish Date:Apr 12, 2022
Advertisement
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల తొక్కిసలాట జరగడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీటీడీ అలసత్వం, అధికారులు నిర్లక్ష్యం వల్లే భక్తులు ఇబ్బందులు పడ్డారని అంటున్నారు. ముగ్గురికి గాయాలవడం, క్యూ లైన్లలో మహిళలు, చిన్నపిల్లలు నలిగిపోవడంపై అంతా మండిపడుతున్నారు. భక్తుల కష్టాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే టీటీడీ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. భక్తులకు సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమన్నారు చంద్రబాబు. భక్తులకు తాగునీరు సదుపాయం, క్యూ లైన్లలో నీడ కూడా కల్పించలేదని, భక్తులపై ఇంతటి నిర్లక్ష్యమా? అని మండిపడ్డారు. టీటీడీ నిర్ణయాలు శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా ఉన్నాయన్నారు. తిరుమల లాంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆదాయ వనరు కోణంలోనే టీటీడీ చూస్తోందన్నారు. కొండపైకి వెళ్లడానికి కూడా ఆంక్షలు విధించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అని విమర్శించారు. భక్తులకు టీటీడీ క్షమాపణలు చెప్పి.. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇక, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. లాభాలు, జే ట్యాక్స్ లెక్కేసుకోవడానికి వైవీ సుబ్బారెడ్డీ.. టీటీడీ మీ సూటుకేసు కంపెనీ కాదని లోకేష్ మండిపడ్డారు. ఆపద మొక్కులవాడి చెంతకొచ్చేవారిని ఆపదలోకి నెట్టేసింది మీరు కాదా? అని లోకేష్ ప్రశ్నించారు. వందల ఏళ్ల తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. అందరివాడు గోవిందుడిని సామాన్యులకి అందనివాడిగా చేశారని లోకేష్ విమర్శించారు. శ్రీవారి సేవలు, టికెట్లు, ప్రసాదం ధరలను మూడింతలు పెంచడంపైనే మీకు ఆరాటమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/tdp-fire-on-ttd-39-134293.html





