పంచాయతీ ఎన్నికలతోనే వైసీపీ పతనం!
Publish Date:Jan 23, 2021
Advertisement
స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ప్రభుత్వం, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య జరిగిన వార్ కు తెరపడింది. తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్లు కూడా మొదలయ్యాయి. ప్రభుత్వ అధికారులు సహకరించకపోయినా ఎన్నికలు జరిపి తీరుతామని చెప్పారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పార్టీ కేడర్ ను అప్రమత్తం చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి కీలక సూచనలు చేశారు చంద్రబాబు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది కావాలని పార్టీ నేతలతో చెప్పారు చంద్రబాబు. ఈ ఎన్నికల ద్వారా వైసీపీ రౌడీ రాజ్యానికి ముక్కుతాడు వేయాలన్నారు. అన్ని పంచాయతీలలో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉండాలని సూచించారు. వైసీపీ దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కోవాలని... బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోవాలని పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని... వైసీపీ నేతల దౌర్జన్యాలను సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి, అధికారులకు, టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు జగన్ కంకణం కట్టుకున్నారని విమర్శించారు చంద్రబాబు. ప్రజల్లో వైసీపీ పట్ల చాలా వ్యతిరేకత ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయం వైసీపీలో ఉందని అన్నారు.టీడీపీ కార్యకర్తంగా గట్టిగా పోరాడి వైసీపీని ఓడించాలని చంద్రబాబు పిలుపిచ్చారు.
http://www.teluguone.com/news/content/tdp-chief-chandrababu-alert-party-workers-for-local-body-election-39-109145.html





