ఈ నెలాఖరుకే కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా!
Publish Date:May 31, 2023
Advertisement
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచాయి. తెలంగాణలోనూ అధికారంలోకి రాగలమనే విశ్వాసాన్ని మరో మెట్టు పైకి తీసుకు వెళ్ళాయి. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఎన్నికల వ్యూహకర్త, సునీల్ కనుగోలు తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తోండటంతో.. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై తెలంగాణ కాంగ్రెస్ లో ఆశలు నెలకొన్నాయి. అంతే కాదు, అక్కడ పాటించిన పద్ధతిలోనే, అదే పంధాలో తెలంగాణలో అడుగులు వేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులో భాగంగా, ఎన్నికల వ్యూహ హకర్త సునీల్ కనుగోలు బృందం ఇచ్చిన సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్ధులను ముందుగానే ఖరారు చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో అభ్యర్దుల ఎంపికకు చివరి క్షణం వరకు వేచి చూసే పద్దతికి స్వస్తి చెప్పిన హస్తం పార్టీ, తెలంగాణలోనూ అదే పద్దతిని ఫాలో అవుతోందని అంటున్నారు. కనీసం సగం నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరులోగా దాదాపు 50 శాతం నియోజక వర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెపుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అనేక సర్వేలు నిర్వహించిన సునీల్ కనుగోలు బృందం, ఇప్పడు తాజాగా మరో సర్వే నిర్వహిస్తోందని, ఈ సర్వే ఫలితాలు వచ్చిన వెంటనే సర్వే రిపోర్టులను విశ్లేషించి 60 మంది అభ్యర్ధులతో తొలి జాబితా సిద్దమవుతుందని అంటున్నారు. అయితే, అభ్యర్ధుల పేర్లను వెంటనే ప్రకటించకుండా, ఏంపికైన అభ్యర్ధులకు పచ్చ కార్డు పంపుతారని అంటున్నారు. సర్వేలలో వచ్చిన ఫలితాల ఆధారంగా నియోజకవర్గాల్లో గ్రాఫ్ తక్కువగా ఉన్న నేతలను వేరే నియోజకవర్గాలకు మార్చుతారు. కర్ణాటకలో ఇదే ప్లాన్‌ను అమలు చేసి కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కూడా అదే ప్లాన్‌ను అమలు చేయాలని చూస్తోంది. సునీల్ కనుగోలు టీమ్‌తో పాటు ఇతర ఇండిపెండెంట్ ఏజెన్సీలు ఇచ్చే రిపోర్టుల ఆధారంగా నేతలు పోటీ చేసే నియోజకవర్గాలను మార్చే అవకాశముందని అంటున్నారు. ఓ వంక అభ్యర్ధుల ఎంపిక కసరత్తు సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, మరో వంక కర్ణాటక తరహాలో ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని సిద్ద చేస్తునట్లు తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం ముగిసిన తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా, తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియమ్మ అనే నినాదంతో ప్రచారాన్ని పాజిటివ్ నోట్ తో ప్రారంభించేందుకు ప్రచార సామాగ్రిని సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, కర్ణాటక ఎన్నికల్లో పెద్దగా ప్రచారంలో పాల్గొనని సోనియా గాంధీ తెలంగాణలో కొంత విస్తృతంగా పర్యటించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా తెలంగాణలో మరింత విస్తృతంగా పర్యటించే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలలో ఒకరైనా ప్రతీనెలా రాష్ట్ర పర్యటనకు వచ్చేలా ప్లాన్ చేస్తోన్నారని అంటున్నారు.. అలాగే ఏఐసీసీ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నాయకులు రాష్టంలో విస్తృతంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్డంవుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఫలితం ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు, టీ కాంగ్రెస్ ను రేసులోకి తీసుకు వచ్చింది. అంతే కాదు, బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్ధి కమలం కాదు, కాంగ్రెస్ పార్టీనే అని , బీజేపీ నాయకులే బహిరంగంగా ఒప్పు కుంటున్నారంటే... ఒక్క గెలుపుతో హస్త రేఖలు ఎలా మరిపొయాయో ..అర్థం చేసుకోవచ్చు.
http://www.teluguone.com/news/content/tconfress-candidates-1st-list-39-156154.html