హైదరాబాద్ లోని తమిళనాడు మాజీ సీఎం నివాసం సీజ్
Publish Date:Mar 31, 2026
Advertisement
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్‌లోని నివాసాన్ని అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో జయలలితకు చెందిన నివాసాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ నివాసానికి సంబంధించి దీర్ఘకాలంగా ఇంటిపన్ను చెల్లించకపోవడంతో నిబంధనల మేరకు అధికారులు ఈ నివాసాన్ని సీజ్ చేశారు. మంగళవారం (మార్చి 31) ఉదయం ఇక్కడకు చేరుకున్న జీహెచ్ ఎంసీ అధికారులు సీజ్ ప్రక్రియను పూర్తి చేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఈ నివాసానికి సంబంధించి 83 లక్షల రూపాయల మేర ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోవడం, ఎన్నిమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. గతంలో జయలలిత హైదరాబాద్ సందర్శించిన సందర్భాలలో ఆమె ఇక్కడ బస చేసేవారు. సినిమా రంగంలో అగ్రతారగా వెలిగి, ఆ తర్వాత తమిళనాడు రాజకీయాలను శాసించిన జయలలితకు దేశవ్యాప్తంగా అనేక చోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. అయితే ఆమె మరణానంతరం ఈ ఆస్తుల నిర్వహణ విషయంలో స్పష్టత లేకపోవడంతో పన్నుల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలోని జయలలిత నివాసం ఎవరి పర్యవేక్షణలో ఉందన్న విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నివాసానికి చెందిన పన్ను బకాయిలను వారసులు లేదా ఈ ఆస్తిని పర్యవేక్షిస్తున్న బాధ్యులు చెల్లిస్తేనే ఈ సీజ్ తొలిగే అవకాశం ఉంది. ఒకవేళ బకాయిలు చెల్లించని పక్షంలో మున్సిపల్ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది.
http://www.teluguone.com/news/content/tamilnadu-fermer-cm-jayalalith-residence-seized-36-216424.html





