కరోనా టీకా వేయించుకున్న ఆరోగ్యశాఖ మంత్రి!
Publish Date:Jan 22, 2021
Advertisement
భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్ ను తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.విజయభాస్కర్ ఈ రోజు తీసుకున్నారు. ఇటీవల తొలి దశ వ్యాక్సినేషన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి దశలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్లు ఇస్తున్నారు. తాను కూడా వైద్యుడు కావడంతో విజయభాస్కర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. టీకా తీసుకున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన మంత్రి.. ఓ డాక్టర్ గా, ఐఎంఏ సభ్యుడిగా టీకా వేసుకున్నట్లు చెప్పారు. హెల్త్ వర్కర్లలో విశ్వాసాన్ని నింపేందుకే తాను టీకా తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, కరోనా నుంచి రక్షణ పొందాలని విజయభాస్కర్ అన్నారు. కాగా, దేశంలో తొలి దశ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాక కొందరు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో వ్యాక్సిన్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైల్స్ పూర్తిచేయకుండానే వ్యాక్సినేషన్ ప్రారంభించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని, వ్యాక్సిన్ సేఫ్ అయితే ముందు ప్రజాప్రతినిధులు వ్యాక్సిన్ తీసుకోవాలని చూపించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి వ్యాక్సిన్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. మంత్రి చర్యతో వ్యాక్సిన్ పై వ్యక్తమవుతున్న అనుమానాలు తొలగిపోతాయేమో చూడాలి.
http://www.teluguone.com/news/content/tamil-nadu-health-minister-c-vijayabaskar-takes-covaxin-shot-39-109097.html





