హంగ్ ఏర్పడితే సర్కార్ కొలువుదీరేది ఎలా?... గతంలో మైనార్టీ ప్రభుత్వాలు ఎలా నిలిచాయి?
Publish Date:May 7, 2026
Advertisement
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్పష్టమైన మెజార్టీ లభించకపోవడంతో అక్కడ సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో 'హంగ్' ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఎలా ఉంటుంది? గతంలో ఇలాంటి పరిస్థితుల్లో మైనార్టీ ప్రభుత్వాలు ఎలా కొలువుదీరాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏ పార్టీకీ మెజార్టీ రాని పక్షంలో గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగిస్తారు. అతిపెద్ద పార్టీని గానీ లేదా ఎన్నికల అనంతర కూటమిని గానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. గత దశాన్నర కాలంలో మహారాష్ట్ర, కర్ణాటక, గోవా వంటి రాష్ట్రాల్లో ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2019లో మహారాష్ట్రలో దాదాపు 34 రోజుల పాటు రాజకీయ హైడ్రామా కొనసాగింది. అనంతరం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఈ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్నాయి. మూడు రోజులకే కూలిన ప్రభుత్వం.. 2018లో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలోనూ ఇదే తరహా రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం 222 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో బీజేపీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌కు 80, జేడీఎస్‌కు 37 స్థానాలు దక్కాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 స్థానాల మెజార్టీ ఎవరికీ రాలేదు. దీంతో నాటి గవర్నర్ వాజూభాయ్ వాలా బీజేపీ నేత యడియూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా, బలపరీక్ష నిర్వహించాలని ఆదేశాలు వెలువడ్డాయి. బీజేపీకీ తగిన సంఖ్యాబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు ముందే యడియూరప్ప ప్రభుత్వం కేవలం మూడు రోజులకే కూలిపోయింది. తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్‌కు షాక్.. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలుండగా, 2017 ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ 17, బీజేపీ 13 స్థానాలు గెలుచుకున్నాయి. అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా నాటి గవర్నర్ మృదులా సిన్హా బీజేపీ నేత మనోహర్ పారికర్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో 2017లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ చిన్న పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. గవర్నర్ తన విచక్షణ మేరకు స్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చే అవకాశం ఉన్న పార్టీని ఆహ్వానించడం ఇక్కడ కీలకంగా మారింది. 2013లో ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 28 సీట్లతో కాంగ్రెస్ మద్దతుతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.ప్రస్తుతం తమిళనాడులో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విజయ్ ఇతర పార్టీల మద్దతు కూడగట్టలేకపోతే, రాష్ట్రం రాష్ట్రపతి పాలన దిశగా వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రాజకీయ చదరంగంలో అంతిమ విజేత ఎవరనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
http://www.teluguone.com/news/content/tamil-nadu-election-results-2026-39-219188.html





