రాజీవ్ హత్య కేసులో దోషి విడుదల: సుప్రీం సంచలన తీర్పు
Publish Date:May 18, 2022
Advertisement
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిని విడుదల చేయాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాజీవ్ హత్య కేసులో దోషి అయిన ఏపీ పెరరివలన్ విడుదలకు ఆదేశిస్తూ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బోపన్నలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. రాజీవ్ హత్య కేసులో పెరరివలన్ కు విధించిన మరణ శిక్షను రద్దు చేసిన సుప్రీం కోర్టు ఇప్పుడు అతడి విడుదలకు ఆదేశించింది. పెరరివలన్ విడుదలకు సుప్రీం ఆదేశిస్తూ తీర్పు ఇవ్వడానికి అతడి క్షమాభిక్ష విషయంలో గవర్నర్, రాష్ట్రపతులు నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యమే కారణమని చెప్పాల్సి ఉంటుంది. 19 ఏళ్ల వయస్సులో 1991 జూన్ 11న అరెస్టయిన పెరరివలన్ ఈ 31 ఏళ్లుగా జైలులోనే ఉన్నాడు. రాజీవ్ గాంధీ హత్యకు పేలుడు పదార్ధాలు అందజేసిన నేరంపై అరెస్టయిన పెరరివలన్.. నేరం రుజువు కావడంతో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా సుప్రీం కోర్టు పెరరివలన్ విడుదలకు ఆదేశిస్తూ తీర్పు ఇవ్వడంతో ఇదే కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మిగిలిన ఆరుగురు నిందితులకూ కూడా విడుదలకు మార్గం సుగమమైనట్లేనని న్యాయరంగ నిపుణులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/supreme-sensational-verdict-release-rajiv-murder-case-convict-25-136063.html





