అన్నదాతలపై కేసులు.. బ్యాంకులపై సుప్రీం ఫైర్
Publish Date:May 16, 2022
Advertisement
బ్యాంకులకు చట్టాలు పేదల విషయంలోనే గుర్తు కొస్తాయా? వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన కార్పొరేట్లు వాటి కంటికి ఆనరా? సాధారణంగా ఈ అనుమానాలు ప్రతి సామాన్యుడిలోనూ మెదులుతూ ఉంటాయి. అయితే అవి కేవలం సందేహాలు కాదనీ, పచ్చి నిజాలనీ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆరుగాలం కష్టించి పని చేసే రైతులపైనే కేసులు ఎందుకు పెడుతున్నారంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం బ్యాంకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్న చిన్న మొత్తాలు రుణాలు తీసుకునే రైతులపై కేసులు నమోదు చేసి వారిని కోర్టు మెట్లెక్కేలా చేయడమంటే వారి కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలో ముంచేయడమేనని వ్యాఖ్యానించింది. మధ్య ప్రదేశ్ కు చెందిన ఒక రైతుపై కేసుకు సంబంధించి విచారణలో సుప్రీం కోర్టు బ్యాంకులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. వేల కోట్ల రూపాయలు ఎగవేసిన కార్పొరేట్ కంపెనీల అధిపతులను వేటాడండి అంతే కానీ ఆరుగాలం కష్టించి పని చేసే రైతుల పై ప్రతాపం చూపడం సరికాదు అంటే కాదు అంటూ బ్యాంకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట పెట్టుబడుల కోసం రుణాలు తీసుకునే రైతులపై కేసులు సరికాదని మందలించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రుణం తీసుకున్న మోహన్‌లాల్ పాటిదార్ అనే రైతు వన్ టైం సెటిల్ మెంట్ పథకాన్ని ఎంచుకున్నారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద రూ.36,50,000 చెల్లించాలని అధికారులు తెలిపారు. అయితే సదరు రైతు 35 లక్షలు చెల్లించారు. దీంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అసెట్ రివకరీ బ్యాంక్ ఫైనల్ సెటిల్ మెంట్ కింద మరో 50.50 లక్షల రూపాయలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.దీనిపై ఆరైతు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. మధ్య ప్రదేశ్ హైకోర్టు రైతుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తీర్పును సవాల్ చేస్తూ సదరు బ్యాంక్ సుప్రీం కోర్టకు వెళ్లింది. ఈ కేసు విచారించన సుప్రీం కోర్టు న్యాయమూర్తలు జస్టిస్ చందచూడ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం మహారాష్ట్ర హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర పిటిషన్ ను కొట్టివేసింది. ఈ సందర్భంగా బ్యాంకులను తీవ్ర స్థాయిలో మందలించింది. వేల కోట్లు ఎగ్గొట్టిన వారికి వర్తించని చట్టాలు రైతుల వద్దకు వచ్చేసరికి వర్తిస్తాయా అని ప్రశ్నించింది.
http://www.teluguone.com/news/content/supreme-fires-on-banks-for-cases-against-farmers-25-135954.html





