అయ్యప్పను ఎంతమంది మహిళలు దర్శించుకున్నారంటే?
Publish Date:Jan 18, 2019
Advertisement
శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలకు నిరంతర భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన కారణంగా తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ నెల 2న కనకదుర్గ, బిందు అనే ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం కేరళలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆలయంలోని ప్రవేశించిన మహిళల్లో ఒకరైన కనకదుర్గపై ఆమె అత్త దాడికి దిగడంతో బాధితురాలు కోర్టుని ఆశ్రయించింది. ఆందోళనకారుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ సదరు మహిళలు ఆరోపించారు. తమకు నిరంతర భద్రత కల్పించాలనీ.. మహిళలు ప్రవేశించిన తర్వాత ‘ఆలయ శుద్ధి’ కార్యక్రమం చేపట్టరాదని తమ పిటిషన్‌లో కోరారు. రాజ్యాంగంలో 21వ అధికరణం ప్రకారం ఇలా ఆలయశుద్ధి జరపడం తమ ప్రతిష్టకు భంగం కలిగించడమేనని వాదించారు. యుక్త వయస్సు వయసు మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు ఎలాంటి అడ్డంకులూ సృష్టించకుండా అన్ని విభాగాల అధికారులను ఆదేశించాలనీ.. అయ్యప్ప ఆలయాన్ని సందర్శించగోరిన మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్.. ఆలయ శుద్ధి చేపట్టరాదంటూ ప్రధాన అర్చకుడికి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. కనకదుర్గ, బింధులకు కేరళ ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆదేశించారు. మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పటి వరకు 51 మంది యుక్త వయసు మహిళలు శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నట్టు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆలయంలోకి ప్రవేశించిన మహిళల జాబితాను ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అందజేసింది. ‘దాదాపు 16 లక్షల మంది భక్తులు ఆలయ ప్రవేశానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఏడు వేల మంది మహిళలున్నారు. వారంతా పది నుంచి 50 ఏళ్ల వయసులోపు వారే. 16 లక్షల మందిలో 8.2 లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు. ఇక ఏడు వేల మందిలో ఆలయంలోకి ప్రవేశించింది కేవలం 51 మందే. మొత్తానికి 2018లో ఇప్పటివరకు అయ్యప్పను దర్శించుకున్నవారి సంఖ్య 44 లక్షలు’ అని ప్రకాష్ అనే ప్రభుత్వాధికారి వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/supreme-court-grants-police-protection-to-kanakadurga-and-bindu-39-85353.html





