పాలమూరు, సీతమ్మ సాగర్ లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.!
Publish Date:Jul 30, 2026
Advertisement
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వం చేపట్టిన బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులకు సంబంధించి ఎదురవుతున్న చిక్కులను తొలగిస్తూ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. పాలమూరు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతొ ఆ ప్రాజెక్టులపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. ఈ కేసు విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ 2021వ సంవత్సరంలో జారీ చేసిన వివాదాస్పద ఆఫీస్ మెమోరాండంను ధర్మాసనం రద్దు చేసింది. సదరు నిబంధన చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్లను పరిశీలించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు భవిష్యత్తులో చేపట్టే పర్యావరణ అంశాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. గతంలో ఆఫీస్ మెమోరాండం ఆధారంగా మంజూరైన పర్యావరణ అనుమతులన్నీ యథాతథంగా చెల్లుబాటులోనే ఉంటాయని, వాటి చట్టబద్ధతకు ఎలాంటి ఆటంకం లేదని స్పష్టం చేసింది. సుప్రీం సానుకూల తీర్పుతో దక్షిణ తెలంగాణ ప్రాంతానికి అత్యంత కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ తో పాటు , సిద్దిపేట పరిధిలోని గౌరవెల్లి రిజర్వాయర్లకు చిక్కులన్నీ తొలగిపోయాయి. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టుల పర్యావరణ క్లియరెన్స్లపై కొనసాగుతున్న చట్టపరమైన ఆటంకాలకు చెల్లు చీటీ పడింది. Palamuru Rangareddy Project, Sitarama Sagar, Supreme Court Verdict, Environmental Clearance
http://www.teluguone.com/news/content/supreme-court--green-signal-to-telngana-projects-36-227539.html





