బుల్డోజింగ్ రాజ్యాంగ విరుద్ధం.. కూల్చివేతల విషయంలో నిబంధనలు పాటించాలి.. సుప్రీం
Publish Date:Nov 22, 2024
Advertisement
ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ళుగా సాగిస్తున్న బుల్డోజింగ్ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా భావించాలి. నిందితుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఒక అధికారి న్యాయమూర్తిగా వ్యవహరించి నిందితుడి ఆస్తిని నేలమట్టం చేయడం అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇది ఆర్టికల్ 19 ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. నిందితుడి తప్పు వల్ల అతడి కుటుంబ సభ్యులను రోడ్డున పడేయడం దారుణం, దుర్మార్గం, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు విస్ఫష్టంగా పేర్కొంది. అవి అక్రమ నిర్మాణాలు అయితే కనీసం 15 రోజుల ముందు నోటీసు ఇచ్చి కూల్చివేయాలని, నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాలని ఆదేశించింది. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే అధికారులే బాధ్యత వహించాలని, కూల్చిన కట్టడాలను సొంత ఖర్చులతో నిర్మించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు బుల్డోజింగ్ పాలకులకు కనువిప్పు కలిగిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే యోగి సర్కార్ ఇలా సుమారు నాలుగు లక్షల ఇళ్లు కూల్చివేశారు. ఈ నిరంకుశ న్యాయం మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలకు వ్యాపించింది. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన ఈ బుల్డోజింగ్ న్యాయానికి వ్యతిరేకంగా గత కొంత కాలంగా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్లో వామపక్షాలు దీనిపై గట్టిగా గళమెత్తాయి. గత ఏడేళ్లుగా ఈ దారుణం యూపీలో జరుగుతుంటే అదొక ఘనకార్యం గా ఆ పార్టీ వర్గాలు చెప్పుకున్నాయి. మైనార్టీ వర్గాలపై బీజేపీ ప్రభుత్వం బుల్డోజింగ్ ప్రయోగిస్తున్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఇలాంటి కూల్చివేతలపై సుప్రీంకోర్టులో దాఖలైన ఈ కేసు విచారించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. తెలంగాణలో కూడా బుల్డోజింగ్ తరహాను ఫాలో అవుతున్న హైడ్రా కూడా అక్రమ నిర్మాణాలు నిర్మించిన వారికి సమయం ఇవ్వాల్సిఉంది. హైడ్రా విధానం ప్రారంభంలో దూకుడుగా వెళ్లిన విషయం విదితమే. మూసినది చుట్టుపక్కల ఆక్రమణల పై కూడా ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఈ బుల్డోజింగ్ పై సుప్రీంకోర్టు లో విచారణ ప్రారంభమైనప్పటి నుంచి హైడ్రా దూకుడు ఒకింత తగ్గింది. మొత్తం మీద నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మాణాలను అక్రమంగా కూల్చివేయడం తగదంటూ సుప్రీం వెలువరించిన తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
http://www.teluguone.com/news/content/supreme-check-to-illegal-demolitions-39-188794.html