ఏపీ సర్కార్ నెత్తిన కొత్త మొట్టికాయ..రుషి కొండ తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం
Publish Date:Jun 1, 2022
Advertisement
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుంది జగన్ సర్కార్ తీరు. ఎన్నిసార్లు కోర్టుల్లో అక్షింతలు పడ్డా ప్రభుత్వం తీరు ఏ మాత్రం మారడం లేదు. ప్రతిసారీ ఏదో ఒక పనికిమాలిన పని చేయడం.. ఆపై కోర్టులు మొట్టికాయలు వేయడం, బుర్ర బొప్పి కట్టడం వైసీపీ సర్కార్ కు ఒక ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా సుప్రీం కోర్టులో వైసీపీకి మరో మొట్టికాయ పడింది. విశాఖపట్నంలోని రుషికొండ వద్ద కొత్తగా తవ్విన చోట నిర్మాణాలు వద్దంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వైసీపీ సర్కార్ ను ఆదేశించింది. రుషికొండలో 62 ఎకరాల స్థలం ఉంది. రుషికొండలో గతంలో రిసార్టు ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే నిర్మాణాలు చేయాలని ఆదేశించింది. అంతకు మించి ఒక్క ఇంచు కూడా అధికంగా నిర్మాణాలు చేయొద్దని ఆదేశించింది. రుషికొండను పునరుద్ధరించేందుకు కూడా అవకాశం లేకుండా మొత్తం తొలి చేయడం గమనార్హం. రుషికొండ అభివృద్ధి నెపంతో అక్కడ ఉన్న పచ్చదనం మొత్తం మాయం చేయడం ఏంటని సుప్రీం ధర్మాసనం నిలదీసింది. భవనాల నిర్మాణం వేరు.. కొండను తొలిచేయడం వేరు అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతకు ముందు కూడా ఆంధ్రప్రదేశ్ జన రాజధాని అమరావతిని కాదని, మూడు రాజధానులంటూ దూకుడుగా వ్యవహరించి, ఆనక కోర్టు మొట్టికాయలతో వెనక్కి తగ్గింది. మూడు రాజధానులంటే మాడు పగిలేలా ఉందని భావించిన వైసీపీ సర్కార్ ‘తేలు కుట్టిన దొంగ’ మాదిరి సైలెంట్ అయిపోయింది. దాంతో పాటు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన సీఆర్ డీఏను కోర్టు మొట్టికాయలతో మళ్లీ పునరుద్ధరించింది. సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏవో వంకలు పెట్టి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. రెండేళ్లు అలాగే ఆయనను సస్పెన్షన్ లో ఉంచేసింది. చివరికి సుప్రీంకోర్టుతో మొట్టికాయలు వేయించి మరీ ఏబీవీ మళ్లీ ఉద్యోగంలో చేరడంతో చేసేదేమీ లేక అన్నీ మూసుకుని కూర్చుంది. అలాగే వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చీ రాగానే టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేన్నయినా నామరూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకుని మొండిగా కదిలింది. ఆ క్రమంలోనే 2023 వరకు కొనసాగేందుకు అవకాశం ఉన్న వక్ఫ్ బోర్డును 2019 జూలైలోనే రద్దు చేసేసింది. దీంతో కొందరు వక్ఫ్ బోర్డు సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో వక్ఫ్ బోర్డు రద్దు జీఓను హైకోర్టు రద్దు చేసింది. ఏపీలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ లాంటి కోర్సులకు అంతకు ముందు నిర్ణయించిన ఫీజులే కొనసాగాలని వైసీపీ సర్కార్ జారీ చేసిన జీఓ 38 అమలును హైకోర్టు నిలిపివేసింది. బార్ లైసెన్సుల ఉపసంహరణ విషయంలో కూడా జగన్ సర్కార్ కు హైకోర్టులో చుక్కుదురైంది. పంచాయతీ, ప్రభుత్వ భవనాలకు వేసిన వైసీపీ పతాకాన్ని పోలిన రంగుల్ని తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. అమరావతి నుంచి వివిధ కార్యాలయాలను తరలించేందుకు వైసీపీ సర్కార్ యత్నించినప్పడు కూడా హైకోర్టు అడ్డుకట్ట వేసింది. తమ ఆదేశాలు ధిక్కరిస్తే పర్యవసానాలు తప్పవని హైకోర్టు హెచ్చరించే దాకా వైసీపీ సర్కార్ తెచ్చుకుంది. ఇక సీఎం జగన్ బాబాయ్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు వైసీపీ సర్కార్ విముఖత చూపింది. అయితే.. హైకోర్టు మాత్రం వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చెంపదెబ్బ తిన్నట్లయింది. పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు విషయంలో కూడా జగన్ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బే తగిలింది. గతంలో జరిగిన ఒప్పందాన్ని రద్దుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దని వైసీపీ సర్కార్ ను, ఏపీ జెన్కోను ఆదేశించింది. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్ని ఇళ్ల స్థలాలుగా మార్చి వేరేవారికి ఇచ్చే అధికారం వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడుందని హైకోర్టు నిలదీసింది. వన్ సైడ్ గేమ్ ఆడతానంటే సహించేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.
http://www.teluguone.com/news/content/supreme--fires-on-ycp-sarkar-on-rishikonda-issue-25-136845.html





