ఆ వార్తలన్నీ కట్టుకథలే.. తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు
Publish Date:Jan 8, 2021
Advertisement
సుప్రీంకోర్టులో అంతర్గతంగా జరిగే వ్యవహారాలన్నీ అత్యంత రహస్యంగా ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉన్నత న్యాయవ్యవస్థలో ఉన్న వారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే చర్యలు తీసుకోనున్నట్లుగా కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. సర్వోన్నత న్యాయస్థానం చేపట్టే అంతర్గత విచారణలు చాల గోప్యంగా జరుగుతాయని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇటువంటి వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై సుప్రీంకోర్టు మీడియాకు ఎప్పుడూ సమాచారం విడుదల చేయదని తెలిపింది. "సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన సభ్యులకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ వచ్చిన ఫిర్యాదుల గురించి మీడియా ఇటీవలి కాలంలో కొన్ని వార్తలు ప్రచురిస్తోంది. ప్రధాన న్యాయమూర్తి వారిపై చర్యలు తీసుకున్నారని, తీసుకునే అవకాశాలున్నాయని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయని పేర్కొంటున్నాయి. అయితే పూర్తి గోప్యతతో చేపట్టే అంతర్గత దర్యాప్తులకు సంబంధించి సుప్రీంకోర్టు ఎప్పుడూ కూడా సమాచారాన్ని బయటకు విడుదల చేయదు" అని సదరు ప్రకటనలో స్పష్టం చేసింది. తాము ప్రచురిస్తోన్న కథనాల పట్ల విశ్వసనీయతను కాపాడుకోవడానికే కొన్ని మీడియా సంస్థలు.. సుప్రీంకోర్టు నుంచే తమకు ఆ సమాచారం తెలిసిందంటూ పేర్కొంటున్నాయని కూడా ఆ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రకటనలో ఎటువంటి మీడియా వార్తనూ ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇదిలాఉండగా కొద్దిరోజుల క్రితం ఎపి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణకు వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్ బాబ్డే కు చేసిన ఫిర్యాదులపై అయన చర్యలు తీసుకుంటున్నారంటూ వచ్చిన వార్తలపైనే ఈ ప్రకటన విడుదల చేసి ఉంటారని తెలుస్తోంది. అయితే కొత్త సంవత్సరంలో సుప్రీంకోర్టు నుండి వచ్చిన మొట్టమొదటి ప్రకటన ఇదే కావడం గమనార్హం.
http://www.teluguone.com/news/content/suprem-court-rebuffs-media-reports-on-its-action-against-senior-judge-39-108669.html





