భర్త హత్యకు 14 తులాల బంగారం సుపారీ
Publish Date:Apr 24, 2026
Advertisement
భర్త హత్యకు ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దింపిన భార్య ఘటన వైయస్సార్ కడప జిల్లాలో సంచలనం రేపింది. ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్‌రెడ్డికి 15 ఏళ్ల క్రితం శిల్పారెడ్డితో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈశ్వర్‌రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న సుధీర్ అనే వ్యక్తి శిల్పారెడ్డికి పరిచయమయ్యాడు. కొద్ది రోజుల తర్వాత వారి పరిచయం వివాహేతర బంధంగా మారింది. ఈ విషయం కొన్ని రోజుల క్రితం శిల్పారెడ్డి భర్త ఈశ్వర్‌రెడ్డికి తెలిసింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు మరింత పెరిగాయి. దీంతో శిల్పారెడ్డి ఈ విషయాన్ని ప్రియుడు సుధీర్‌కు తెలిపింది. ‘అలాగైతే నీ భర్తను చంపేద్దాం ఆస్తితోపాటు ఉన్న బంగారు, డబ్బు అంతా మనకే వస్తుందని’ సుదీర్ ఆమెతో అన్నాడు. అందుకు శిల్పారెడ్డి కూడా అంగీకరించింది. ఆమె రాజుపాళెంలోని రౌడీషీటర్ నవీన్ ద్వారా హిందూపురంలో ఉంటున్న లిల్లీ గ్యాంగ్‌ను ఆశ్రయించింది. పోలీసుల వివరాల ప్రకారం, ఈశ్వర్ రెడ్డిని చంపేందుకు రూ.10 లక్షలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకొని, అందులో రూ.5 లక్షలను అడ్వాన్స్‌గా చెల్లించారు. ఇందుకోసం శిల్ప తన నగలను తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చినట్లు వెల్లడైంది. ముందస్తు ప్లాన్ ప్రకారం కిరాయి గ్యాంగ్ సభ్యులు కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశారు. అనంతరం కత్తులు, ఇనుప రాడ్లతో వెంటాడి దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన ఈశ్వర్ రెడ్డి అక్కడి నుంచి తప్పించుకుని ప్రొద్దుటూరు ఒకటవ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రొద్దుటూరు ఎంఎస్పీ విభూకృష్ణ పర్యవేక్షణలో సీఐ కొండారెడ్డి, ఎస్సైలు శ్రీనివాసులు, మధుసూదన్ రెడ్డి బృందం వేగంగా చర్యలు తీసుకుని కుట్రను ఛేదించారు. యర్రగుంట్ల రోడ్డులో అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో దాడికి పాల్పడిన 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో భార్య శిల్ప, ప్రియుడు సుధీర్ కూడా ఉన్నారు. వారి వద్ద నుంచి కత్తులు, పిడిబాకులు, ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు రూ.5 లక్షల నగదు, రెండు కార్లు, 10 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు.ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
http://www.teluguone.com/news/content/supari-gang-along-with-boyfriend-for-husbands-murder-36-218172.html





