అప్పుడే ఎండలు మండిపోతున్నాయ్.. రోహిణీకార్తె ముందే వచ్చేసిందా?
Publish Date:Feb 18, 2025
Advertisement
మహా శివరాత్రి తరువాత వేసవి మొదలౌతుంది. ఇది సాధారణం. శివరాత్రికి చలి శివశివా అంటూ పారిపోతుందన్నది ప్రతీతి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. మహా శివరాత్రికి ముందే వేసవి గాడ్పులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయ్. ఫిబ్రవరి రెండో వారం నుంచే ఏసీలు లేకుండా ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి వచ్చిందంటే ఎండల తీవ్రత ఏ విధంగా ఉండో అర్ధం చేసుకోవచ్చు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఉక్కపోత జనాలను ఊపిరాడనీయకుండా చేస్తున్నది. ఇప్పుడే పగటి ఉష్ణోగ్రతలు 40 డీగ్రీలకు చేరువ కావడం ఆందోళణ కలిగిస్తోంది. ఇప్పుడే ఇలా ఉండే ఇక ఏప్రిల్, మే నాటికి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించిపోయినా ఆశ్చర్యం లేదు. సాధారణంగా మేనెలలో రోహిణి కార్తె లో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయని చెబుతారు.కాని ఇప్పుడు మార్చిలో నే రోళ్లు పగిలే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. గాలిలో తేమశాతంలో భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. పగటిపూట గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోతున్నది. అంతే ముందు ముందు ఎండ తీవ్రత అసాధారణంగా ఉంటుందనడానికి వాతావరణ నిపుణులు దీనిని సంకేతంగా చూపుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్,మే,జూన్ నెలల్లో ఎండలుమండిపోతాయని,విపరీతమైన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే ప్రకటించింది. దేశంలోని పలుప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలకన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం,ఒడిసా ఉత్తర భాగంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనీ వాతావరణ శాఖ పేర్కొంది.
http://www.teluguone.com/news/content/summer-heat-in-febraury-39-193078.html





