తెలిసిన వారికి అప్పు ఇవ్వలేక, కాదు అనలేక ఇబ్బంది పడుతున్నారా..
Publish Date:Jul 31, 2026
Advertisement
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు చాలా వరకు స్నేహితులు, బంధువులు, సన్నిహితులు, ఆఫీసు కొలీగ్స్.. ఇలా చాలామందిని అప్పు అడుగుతూ ఉంటాం. అలాగే వారు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. కానీ నేటికాలంలో డబ్బు తీసుకున్నంత సులువుగా దాన్ని తిరిగి ఇవ్వరు. పైగా డబ్బు తీసుకుని.. ఇస్తాంలే ఎక్కడికి పోతాం.. అని దబాయించే వారు కూడా ఉంటారు. ఈ కారణంగానే కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే చాలా భయం వేస్తుంది. కానీ ఎవరైనా అప్పు అడిగినప్పుడు.. లేదు అని చెప్పడం చిన్న పదమే అయినా.. అది తగిన కారణంగా కనిపించదు. లేదని చెప్పినా కొందరు పదే పదే అప్పు కావాలని, ఎవరితో అయినా అప్పు ఇప్పించమని కూడా అడుగుతుంటారు. అప్పు ఇవ్వడం అనే సమస్య నుండి తప్పించుకోవడం, ఎదుటి వ్యక్తితో ఉన్న సంబంధం ఏదీ పాడు చేసుకోకుండా ఉండటం కత్తిమీద సాము లాంటిది. ఎవరైనా అప్పు అడిగితే.. వారు బాధపడకుండా లేదని చెప్పడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. వెంటనే సమాధానం ఇవ్వకూడదు.. ఎవరైనా అకస్మాత్తుగా డబ్బు అడిగినప్పుడు, ఆలోచించకుండా వెంటనే "అవును" లేదా "కాదు" అని చెప్పకుండా, కొంత సమయం తీసుకోవాలి. ఆ తరువాత ఎదుటివారితో మర్యాదగా "నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను ఈ నెలకు నా బడ్జెట్ , బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోవాలి" అని చెప్పవచ్చు. ఇలా చెప్తే.. మీరే ఆర్థికంగా డబ్బుకు వెతుక్కుంటున్నారని అప్పు అడిగిన వారు అర్థం చేసుకుంటారు. ఇలా సమయం అడగడం వల్ల ఆలోచించడానికి అవకాశం ఇస్తుంది, ఒకవేళ తర్వాత లేదని చెప్పాల్సి వచ్చినా.. ఎదుటి వారు అపార్థం చేసుకోరు. ఎందుకంటే అడిగిన వెంటనే లేదని చెప్తే.. అప్పు అడిగిన వారు అపార్థం చేసుకుంటారు. అప్పు సూత్రం.. ఎవరైనా అప్పు అడిగినప్పుడు వారికి లేదని చెప్పడం కంటే.. అప్పు సూత్రం పాటించడం మంచిది. అప్పు సూత్రం ప్రకారం.. ఎవరికీ అప్పు ఇవ్వడం అనేది పెట్టుకోకూడదు. ఎలాంటి పరిస్థితులలో అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకూడదు. అప్పు అనే కారణం వల్ల సంబంధాలు నాశనం అవుతాయి. అప్పు తీసుకున్నవారు కొన్నిసార్లు తిరిగి ఇవ్వలేకపోతే.. అప్పు ఇచ్చిన వారు చాలా బాధపడాల్సి వస్తుంది. డబ్బు అనేది అంత సులువుగా లభించేది కాదు. కాబట్టి అప్పు అనే కారణంతో సంబంధాలు పాడు చేసుకోను, ఎవరికీ అప్పు ఇవ్వకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాలి. ఇలా చెప్తే ఎదుటి వారు సంబంధాలకు విలువ ఇచ్చేవారు అయితే.. అర్థం చేసుకుంటారు. బాధ్యతలు, ఖర్చులు వివరించడం.. ప్రతి ఒక్కరికీ బాధ్యతలు ఉంటాయి. ఎవరైనా అప్పు అడిగితే, పరిస్థితిని వివరించవచ్చు. పిల్లల ఫీజులు కావచ్చు, ఆరోగ్య సమస్యల ఖర్చులు కావచ్చు, బ్యాంకు లోన్లు కావచ్చు, అప్పులు కావచ్చు.. వాటిని వివరించి అప్పు ఇవ్వలేనని చెప్పవచ్చు. ఇలా సమస్యల గురించి చెబితే.. వివేకవంతుడైన మనిషి ఎవరైనా అర్థం చేసుకుంటారు. ప్రత్యామ్నాయ సహాయం.. చాలామంది డబ్బు అప్పుగా అడిగినప్పుడు.. అప్పు అడిగినవారు నిజంగా అవసరంలో ఉండి, మీరు అప్పు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే.. డబ్బు కాకుండా ఏదైనా పనుల రూపంలో డబ్బు వచ్చే మార్గంలో సహాయం చేయవచ్చు. ఆ పనుల ద్వారా వారికి డబ్బు సహాయం అందితే అప్పు అడిగిన వారు కూడా చాలా తృప్తి పడతారు. ఆరోగ్య సమస్యల కోసం డబ్బు అవసరమైన వారికి స్వచ్చంద సంస్థల నుండి డబ్బు ఇప్పించడం, ఎవరైనా సహాయం చేసే వారి గురించి చెప్పడం లాంటివి చేయవచ్చు. దీని వల్ల వారికి అవసరం తీరుతుంది. లేదని చెప్పడం.. కొన్నిసార్లు దాటవేసి మాట్లాడటం కంటే, నిజం సూటిగా చెప్పడమే మేలు. అయితే చెప్పే విధానం చాలా గౌరవంగా, మర్యాదగా ఉండాలి. చెప్పడానికి నాకు బాధగానే ఉంది కానీ నేను అప్పు ఇచ్చేంత ఆర్థిక స్థితిలో లేను అని సున్నితంగా ఎదుటివారిని నొప్పించకుండా చెప్పవచ్చు.. ఈ విషయం గుర్తుంచుకోవాలి.. చాలామంది అప్పు అడగగానే చాలా చులకనగా, చిరాకుగా, కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం తప్పు.. అప్పు అడిగిన వారు అవసరంలో అడుగుతారు.. వారికి మర్యాదగా, గౌరవంగా సమాధానం చెప్పాలి. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/struggling-to-refuse-a-loan-request-35-227655.html




