కొండా సురేఖ చూపు బీఆర్ఎస్ వైపు.. కేసీఆర్ పై పొగడ్తల వర్షం అందుకేనా?
Publish Date:Sep 4, 2026
Advertisement
రేవంత్ రెడ్డి తన కేబినెట్ నుంచి కొండా సురేఖను బర్త్ రఫ్ తరువాత ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు అన్న ఉత్కంఠ తెలంగాణ రాజకీయవర్గాలలో నెలకొంది. బీజేపీవైపు ఆమె అడుగులు పడే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలకు కూడా చేశారు. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని, నాయకత్వ శైలిని ఆమె కొనియాడతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కొనసాగిన కాలంలో కేసీఆర్తో తమ కుటుంబానికి ఉన్న సంబంధాల గురించి తాజాగా వివరించిన కొండా సురేఖ.. కేసీఆర్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. తాను ఆయనతో ఎప్పుడు భేటీ అయినా ఎంతో ఆప్యాయంగా, హుందాగా రిసీవ్ చేసుకునేవారని గుర్తుచేసుకున్నారు. పార్టీలో సుదీర్ఘకాలం పాటు కలిసి పనిచేసినప్పటికీ, కేసీఆర్ వ్యవహారశైలి తమకు ఎప్పుడూ ఎలాంటి అసంతృప్తి కలిగించలేదన్న కొండా సురేఖ.. బీఆర్ఎస్ అధినాయత్వంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని చెప్పడమే కాకుండా.. కేసీఆర్ నాయకత్వంలో తనకు ఎటువంటి ఇబ్బందులూ ఎన్నడూ ఎదురు కాలేదన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ తన భర్త కొండా మురళికి గతంలో దక్కిన ఎమ్మెల్సీ పదవికి కేసీఆర్ హయాంలోనే దక్కిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్లో ఉన్న సమయంలో కొండా మురళికి శాసనమండలికి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు.. పార్టీలోని కొందరు సీనియర్ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారనీ, ముఖ్యంగా కడియం శ్రీహరి వంటి సీనియర్ నాయకులు మురళికి ఆ పదవిని దక్కకుండా చేసేందుకు తెరవెనుక పావులు కదిపారని తాజాగా ఆరోపించారు. అయితే కేసీఆర్ మాత్రం వాటన్నిటినీ తోసి రాజని, కొండా మురళి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకారం అందించారని కొండా సురేఖ గుర్తు చేసారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొండా సురేఖ కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం రాజకీయంగా ఆమె అడుగులు ఎటుపడుతున్నాయన్నదానిపై ఒక స్పష్టత ఇచ్చేయడమేనన్నారు. గతంలో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొండా సురేఖ.. ఇప్పుడు అదే పార్టీ అధినేతపై ప్రశంసల వర్షం గుప్పించడం వెనుక ఆమె గులాబీ గూటికి చేరే వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు. [Strategy Behind Konda Surekha Praises KCR, Konda, Brs, Konda Murali, MLC, Telangana Politics, Telugu One]
http://www.teluguone.com/news/content/strategy-behind-konda-surekha-praises-kcr-39-230673.html




