నేతల కుమ్ములాటలపై ఆజాద్ సీరియస్
Publish Date:Jan 21, 2012
Advertisement
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో నేతల కుమ్ములాటలపై గులాం నబీ ఆజాద్ సీరియస్ అయ్యారు. పార్టీ పరిస్థితి ఇలానే కొనసాగితే.. మరో తమిళనాడులా రాష్ట్ర కాంగ్రెస్ తయారవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం అవసరమంటూ క్లాస్ తీసుకున్నారు. ముఖ్యంగా సీఎం, పీసీసీ అధ్యక్షుడు పరస్పరం గౌరవించు కోవాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారల ఇన్చార్జ్ ఆజాద్ హితబోధ చేశారు. సుదీర్ఘంగా సాగిన కాంగ్రెస్ రాష్ట్ర కోర్ కమిటీ భేటీలో.. పార్టీ పరిస్థితిపైనే ఆజాద్ ప్రధానంగా దృష్టి సారించారు. ఆజాద్ అధ్యక్షతన కాంగ్రెస్ రాష్ట్ర కోర్ కమిటీ భేటీ శనివారం గాంధీభవన్లో జరిగింది. సీఎం కిరణ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, చిరంజీవి, ఎంపీ కావూరి సాంబశివరావు, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్లు ఇందులో పాల్గొన్నారు. కాగా.. ఈ కమిటీ రెండో దఫా భేటీలో.. ఎన్నికలే ప్రధాన అజెండాగా చర్చి జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో యధావిధిగా కాస్త అసంతృప్తులు వ్యక్తమైనప్పటికీ.. ఈ నెల 5వ తేదీన జరిగిన కోర్ కమిటీ తొలి భేటీలో వ్యక్తమైన స్థాయిలో మాత్రం అవి లేవని సమాచారం. స్థానిక సంస్థల, సహకార, ఉప ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించేందుకు వీలుగా శ్రేణులను సిద్ధం చేయాలని ఆజాద్ ఆదేశించారు.
http://www.teluguone.com/news/content/state-congress-24-11113.html





