40 ఏళ్లకొక సారి వరద రాజ స్వామిదర్శనం... ఎందుకంటే ?
Publish Date:Jul 2, 2019
Advertisement
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందింది. సుమారు 1000 కి పైగా ఆలయాలు కలిగి ఉన్నది. కంచిలో గల ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి.108 దివ్యతిరుపతు ల లో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్యక్షేత్రలలో ఒకటిగాను విరాజిల్లుతుంది. (కంచి దర్శించిన తెలుగువారికి శ్రీ వరదరాజ స్వామి దేవాలయం అనేదానికన్నా బంగారు వెండి బల్లులు ఉన్న ఆలయం అంటే త్వరగా గుర్తువస్తుంది) ఈ ఆలయ౦లోని శ్రీ అత్తి వరదరాజ స్వామి పూజలు అందుకుంటున్నారు. చోళుల కాలంలో నిర్మించిన ఈ ఆలయాన్ని కుళోత్తుంగ చోళ I, విక్రమ చోళుల కాలంలో విస్తరించారు. 14వ శతాబ్దంలో తరువాతి చోళరాజుల సమయంలో మరో గోడ, గోపుర నిర్మాణం జరిగాయి. విష్ణువు యొక్క 108 దివ్య దేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటని చెబుతారు. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఎక్కువ విష్ణాలయాలు కలిగిన కాంచీపుర ప్రాంతమైన విష్ణు కంచిలో ఉంది ఈ ఆలయం. విశ్వకర్మ నిర్మాణ తరహాలో ఉండే ఈ ఆలయ నిర్మాణం చాలా విశిష్టంగా ఉంటుంది. ఇరవై మూడు ఎకరాల్లో ఉన్న ఈ ఆలయంలో బంగారు బల్లి, వెండి బల్లీ ఉన్నాయి. వీటిని జీవితంలో ఒక్కసారి ముట్టుకుంటే ఇక బల్లి మీదపడటం వల్ల ఉండే ఏ దోషాలు ఉండవని హిందువుల నమ్మకం. ఈ బల్లి రూపాలు పైకప్పుపై తాపడం చేసి ఉంటాయి. ఇక ఛతుర్ముఖ బ్రహ్మ యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మచే అత్తి చెట్టు కాండంతొ శ్రీవరదరాజ స్వామి విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు.ఈ మూర్తికి యుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమంలో తురుష్కులు కంచిపై దండెత్తి దేవాలయాలను కూల్చి సంపదలను దోపిడి చేస్తున్న సమయంలో శ్రీ వారి మూర్తికి హాని కలుగకుండా వుండేందుకై ఆలయంలోని ఆనంద పుష్కరిణి లో నీరాళి మంటపం పక్కగా చిన్న మండపం యొక్క అడుగు భాగంలో ఉంచారట. లోపలికి నీళ్లు చేరని విధంగా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరచారట. తదనంతర కాలంలో పరిస్థితి అంతా సర్దుకున్నా కారణాంతరాల వల్ల గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్టించారు. అయితే పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపర్చబడిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ని 40 సంవత్సరం లకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 1979 లో దర్శనం ఇచ్చిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ఈ సంవత్సరం అంటే 2019 జులై 1 వ తేదీ నుండి ఆగస్ట్17 వ తేదీ వరకు తిరిగి దర్శనం ఇవ్వనున్నారు. మొదటి 30 రోజులు శయన(పడుకున్న) భంగిమ లోను చివరి 10 రోజులు స్థానక(నిలుచున్న)భంగిమ లో ను దర్శనం ఇస్తారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ఉచిత దర్శనంతో పాటు 50రూపాయల టికెట్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 11 to 12 వరకు సాయంత్రం 7 to 8 వరకు రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది.ఈ సేవ లో స్వామి ని సేవించడానికి 500 రూ టికెట్ తీసుకోవలసి ఉంటుంది. దర్శన సమయాలు ఉదయం 6 గం నుండి మద్యాహ్నం 2 గం వరకు అలాగే తిరిగి మద్యాహ్నం 3 గ0 నుండి రాత్రి 9 గం వరకు దర్శనం చేసుకోవచ్చు. తమిళనాడులోని కాంచీపురం (కంచి)కి చేరేందుకు అన్ని ప్రధాన నగరాల నుండి రైలు,బస్ సౌకర్యాలు ఉన్నాయి. దాదాపు పదిలక్షలమంది భక్తులు స్వామివారిని దర్శించే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/sri-atti-varadaraja-swami-39-87743.html





