టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు!?
Publish Date:Apr 27, 2022
Advertisement
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రెండు పదుల వయసును దాటేసింది. 21 ఏళ్లను పూర్తి చేసుకుని 22లోకి అడుగుపెడుతోంది. ఒక ప్రాంతీయ పార్టీ చరిత్రలో 20 ఏళ్లు అంటే చిన్న వయసు కాదు. నిజానికి, తెరాస ఆవిర్భావ సందర్భంలో అయితే అంతకు ముందు ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా అంతకు ముందు ఏర్పడిన పార్టీల బాటలోనే తెరాస కూడా తెరమరుగై పోతుందనే అభిప్రాయమే బలంగా వినిపించింది. అయితే, పుష్కర కాలం పైగా తెరాస సారధ్యంలో సాగిన తెలంగాణ ఉద్యమం 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానంతో 2014 లో విజయవంతమైంది. అది చరిత్ర. ఇక ప్రస్తుతంలోకి వస్తే, అలా, మఘలో పుట్టి పుబ్బలో పోతుందనుకున్న పార్టీ, ఈరోజు 21సంవత్సరాలు పూర్తి చేసుకుని 22 వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది.అంతే కాదు, ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న తెరాస, కాలానుగుణంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ఉద్యమ పార్టీగా అందరినీ కలుపుపోయిన తెరాస, రాష్ట్ర ఆవిర్భావ క్షణం నుంచే, ఫక్తు పదహారు అణాల రాజకీయ పార్టీగా అవతరించింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఏమి జరిగింది అనేది, కళ్ళ ముందు కదులుతున్న చరిత్ర. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఉద్యమ పార్టీగా అవతరించిన తెరాస, ఇప్పుడు కుటుంబ పార్టీగా మారిపోయిందనే విమర్శలు, ఆ నాటి ఉద్యమ నాయకులే ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం తెరాస భవిష్యత్ విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర అవతరణ నాటి నుంచి ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో తెరాస ఆధిపత్యం కొనసాగుతూనే వుంది. అయినా, ముఖ్యమంత్రి ఇజ్జత్ కాసవాల్ గా తీసుకున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో వేల కోట్ల రూపాయలు కుమ్మరించినా, ఫలితం లేక పోవడంతో తెరాసలో భయం మొదలైంది. హుజురాబాద్ ఓటమితో మొదలైన అలజడి, ఈరోజు వరకు కూడా కొనసాగుతూనే వుంది. చివరకు, ఎన్నికల వ్యూహరచనలో ఎవరికీ తీసిపోని, కేసీఆర్, దేశంలో ఎన్నికల వ్యూహకర్తగా ఓ వెలుగు వెలుగుతున్న ప్రశాంత్ కిశోర్’ ను ఎంగేజ్ చేసుకున్నారు. ఇందుకు తెరాస నాయకులు ఏకారణం చెప్పినా, తెరాస నాయకత్వానికి విశ్వాసం సన్నగిల్లడం వల్లనే పీకే. ఐప్యాక్ అవసరం ఏర్పడిందని పరిశీలకులే కాదు, ప్రజలు కూడా నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఎవరో అన్నట్లుగా ఇలా ఒక ఉద్యమ పార్టీ, కిరాయి వ్యూహకర్తను వేల కోట్ల రూపాయలు కుమ్మరించి హైర్ చేసుకోవడం, ఉద్యమ స్పూర్తికే అవమానమా అనే మాట వినవస్తోంది. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అందుకు ఇంకా కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ, అన్నటికంటే ముఖ్యంగా 1200ల మంది బలిదానంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన, కుటుంబ అవినీతి పడుకుపోవదమే ప్రధాన కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అయితే, తెరాస నాయకత్వం మాత్రం, ఆవిషయంలో తగ్గేదేలే, అన్న విధంగా ముందుగు సాగుతోంది. ఈ రోజు జరుగుతున్న ప్లీనరీ క్రతువు మొత్తం, అంతా (తారక) రామ మయం అన్నవిధంగా సాగుతోంది. అంటే, కుటుంబ పాలనకు జై కొడుతోంది. కేసీఆర్’ స్థానంలో కేటేఆర్’ బొమ్మ కనిపిస్తోంది.ఈ నేపధ్యంలో తెరాస భవిష్యత్ ఏమిటి? ఎలా ఉంటుంది? ఏమవుతుంది?అనేది కాలమే నిర్ణయించాలి..నిర్ణయిస్తుంది, అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
http://www.teluguone.com/news/content/special-story-on-trs-22-years-25-135046.html