అవినీతికి పాల్పడితే తన, పర భేదం లేదు.. లోకేష్ వినూత్న విధానం
Publish Date:Jan 15, 2026
Advertisement
అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే తన, పర తేడా లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్యేలు, అధికారులపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా అయిన నారా లోకేష్.. అవినీతి, అక్రమాలకు పాల్పడితే తెలుగుదేశం వారైనా, ప్రత్యర్థి పార్టీ వారైనా చర్యలు ఒకేలా ఉంటాయని విస్పష్టంగా చెబుతున్నారు. పొలిటిలక్ గా ఆయన దూకుడు ముఖ్యమంత్రి చంద్రబాబును మించి ఉందని పరిశీలకులు అంటున్నారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు. ఇందు కోసం ఆయన ఒక కొత్త విధానాన్ని తీసుకురావడానికి రెడీ అయిపోయారు. త్వరలోనే ఆ విధానాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఇక అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల మీద ఫిర్యాదులు వస్తే.. వాటిని నాలుగు గోడలమధ్యా చర్చించి, హెచ్చరించో, బుజ్జగించో వదిలేయడమన్నది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీని బ్రేక్ చేస్తామంటున్నారు లోకేష్.
ప్రజల నుంచి ఎమ్మెల్యేలపై, వారు అధికార పార్టీ వారైనా, ప్రత్యర్థి పార్టీవారైనా సరే ఆరోపణలు వస్తే వాటిని స్వీకరించాలని లోకేష్ నిర్ణయించారు. అవినీతికి ఎవరు పాల్పడినా అది తప్పే అని కుండబద్దలు కొడుతున్నారు.
ఇక అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు నేరుగా పార్టీకే ఫిర్యాదు చేసేలా ఒక విధానాన్ని తీసుకురానున్నట్లు ఆయన చెబుతున్నారు. తమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన గానీ అనుచరులు కానీ ఏమైనా తప్పులు పొరపాట్లు చేస్తున్నారా? వంటి విషయాలను జనం నేరుగా పార్టీకే ఫిర్యాదు చేయడానికి వీలుగా తెలుగుదేశం పార్టీ పరంగా ప్రత్యేకమైన ఫోన్ నంబర్ ని ఏర్పాటుచేయనున్నారు. ఆ నంబర్ కి ఫిర్యాదుదారుడు ఎవరైనా ఫోన్ చేయవచ్చు. అలా ఫిర్యాదు చేసిన వారి ఫోన్ నంబర్లను వారి పేర్లను గోప్యంగా ఉంచుతారు. అంతే కాకుండా ఆ ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు కూడా తీసుకుంటారు. ఎమ్మెల్యేలే కాదు, అధికారుల అవినీతి మీద పనితీరు మీద కూడా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధంగా వచ్చే ఫిర్యాదులను సమగ్రంగా విచారించి, నిజానిజాల నిగ్గు తేల్చి అవసరమైతే చర్యలు తీసుకుంటారు. ఇది దేశంలో ఎక్కడా లేని నూతన విధానమనీ, దీనిని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారనీ తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల అధికారులు, ఎమ్మెల్యేలలో తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉంటుందనీ, ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండేందుకు దోహదం చేస్తుందని భావించి లోకేష్ ఈ విధానాన్ని తీసుకురావడానికి సమాయత్తమౌతున్నారని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/special-phone-number-to-complaints-on-mlas-39-212571.html





