నిరాహార దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్.!
Publish Date:Jul 24, 2026
Advertisement
నీట్ పేపర్ లీక్ కు నిరసనగా గత 26 రోజులుగా చేస్తున్ననిరాహార దీక్షను సోనమ్ వాంగ్ చుక్ విరమించారు. పరీక్షల వ్యవస్థలో సమగ్ర ప్రక్షాళన, జవాబుదారీతనం కోరుతూ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరశన దీక్షను సోనమ్ వాంగ్ చుక్ విరమించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు లిఖిత పూర్వక హామీలే కారణం. విద్యార్థుల హక్కుల కోసం ఒక పోరాట యోధుడిలా నిలబడిన వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆయన వైద్య చికిత్సను నిరాకరించి నిరశన కొనసాగించడంతో కేంద్రం దిగివచ్చింది. గురుగ్రామ్ మేదాంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్చుక్ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా కలిసి కేంద్ర ప్రభుత్వం తరఫున హామీల పత్రాన్ని అందజేశారు. అంతకు ముందు రెండు మూడు రోజుల నుంచీ.. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వాంగ్‌చుక్ బృందం విస్తృత స్థాయి చర్చలు జరుపుతోంది. మౌఖిక ప్రకటనలు లేదా మాటలకు పరిమితం కాకుండా, స్పష్టమైన లిఖితపూర్వక భరోసా ఇస్తేనే దీక్ష విరమిస్తానని వాంగ్‌చుక్ ఆ బృందానికి విస్పష్టంగా తేల్చి చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు లిఖిత పూర్వకంగా రావడంతో దీక్ష విరమించినట్లు ఆయన తెలిపారు. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలేమిటంటే.. నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఘటనతో పాటు దేశంలోని పరీక్షల నిర్వహణ వ్యవస్థలో చోటుచేసుకున్న లోపాలు, అక్రమాలకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యల అంశాన్ని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో సమగ్రంగా చర్చిచడం, పేపర్ లీక్ వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ న్యాయమైన హక్కుల కోసం ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడం, ఉన్న కేసులను ఎత్తివేయడం. ఈ మూడు హామీలతో సోనమ్ వాంగ్‌చుక్ నిరశన దిక్ష విరమించారు. కేంద్ర హామీలకు తోడు.. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు, విద్యార్థులు, పౌరసమాజ ప్రతినిధులు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిరశన దీక్ష విరమించాలని చేసిన విజ్ణప్తులు కూడా తన దీక్ష విరమణకు కారణమని ఆయన తెలిపారు. తన పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు. దీక్ష విరమణ అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా స్పందించారు. వాంగ్‌చుక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వైద్యుల సూచనలు పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని సూచించారు. అంతేకాకుండా, నీట్ పేపర్ లీక్ ఘటనలకు బాధ్యులైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని, భవిష్యత్తులో దేశంలో ఎలాంటి పోటీ పరీక్షల్లోనూ ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రధాని మరోసారి దేశానికి భరోసా ఇచ్చారు. NEET UG 2026 paper leak, Central government assurances, JP Nadda Jitendra Singh Medanta
http://www.teluguone.com/news/content/sonam-wangchuk-calls-off-hunger-strike-36-226939.html




