ఓటర్ల జాబితాలో స్మృతి ఇరానీ పేరు గల్లంతు
Publish Date:Jun 12, 2026
Advertisement
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ పేరు ఓటర్ల జాబితా గల్లంతైంది. అమేథీ జిల్లాలోని మైదాన్ మైవా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో ఆమె పేరునే తొలగించడం ప్రత్యర్ధులకు హాస్యాస్పదంగా మారింది. 2024 లోక్‌సభ, 2022 అసెంబ్లీ ఓటర్ల జాబితాలో అక్కడే స్మృతి ఇరానీ పేరు నమోదై ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించి 2019 నుంచి 2024 వరకూ అమేథీ నియోజకవర్గానికి స్మృతి ఇరానీ ప్రాతినిధ్యం వహించి, కేంద్రమంత్రిగా కొనసాగారు. 2019 పార్లమెంటరీ ఎన్నికల్లో గెలుపు అనంతరం అమేథీ జిల్లా గౌరీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మైదాన్ మైవాలో ఆమె ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ గ్రామ ఓటరుగా కూడా పేరు నమోదైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ అక్కడి నుంచే ఆమె తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కిషోరి లాల్ శర్మ చేతిలో ఓటమి చవిచూశారు. తాజాగా జూన్ 10న పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రకటించగా అందులో స్మృతి ఇరానీ పేరు కనిపించలేదు. దీనిపై ప్రస్తుతం విచారణకు ఆదేశించినట్టు అమేథీ జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ చౌహాన్ మీడియాకు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం తెలుస్తుందని చెప్పారు. బీజేపీ అమేథీ జిల్లా అధ్యక్షుడు సుధాన్షు శుక్లా మాట్లాడుతూ, పంచాయతీ ఓటర్ల జాబితాలో స్మృతి ఇరానీ పేరు చేర్చాల్సిందిగా దరఖాస్తు ఇచ్చామని, సీనియర్ అధికారులు దీనిని పరిశీలిస్తున్నారని చెప్పారు. వెరిఫికేషన్ అనంతరం ఓటర్ల జాబితాలో పేరు చేరుస్తామని అధికారులు హామీ ఇచ్చినట్టు చెప్పారు.
http://www.teluguone.com/news/content/smriti-iranis-name-missing-from-voters-list-36-222772.html





