సిరాజ్ మ్యాజిక్.. విజయానికి ఏడు పరగుల దూరంలో ఇంగ్లాండ్ ఆలౌట్
Publish Date:Aug 4, 2025
Advertisement
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు. 374 పరుగల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఒక దశలో సునాయాసంగా విజయం సాధిస్తుందా అనిపించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ధారాళంగా పరుగులు చేయడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. హ్యారీ బ్రూక్, జోరూట్ లు సెంచరీలతో చెలరేగడంతో 374 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకగా ఛేదించేస్తుందని అంతా భావించారు. అయితే జోరుమీదున్న ఇంగ్లాండ్ కు ప్రసిద్ధకృష్ణ, మహ్మద్ సిరాజ్ లు కళ్లెం వేశారు. ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగుల వద్ద నాలుగో రోజు ఆట ముగించిన ఇంగ్లాండ్.. నాలుగు వికెట్లు చేతిలో ఉండటంతో అలవోకగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణలు పదునైన బంతులతో ఇంగ్లాండ్ దూకుడుకు కళ్లెం వేశారు. ఓవర్ నైట్ బ్యాట్స్ మన్ జెమీ స్మీత్ ఓవర్టన్ లను సిరాజ్ పెవిలియన్ కు పంపాడు. జోష్ టంగ్ ను ప్రసిద్ధ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో గాయంతో బాధపడుతున్న క్రిస్ వోక్స్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఆ దశలో ఇంగ్లాండ్ కు విజయానికి 17 పరుగులు అవసరం. గాయంతో ఉన్న వోక్స్ కు స్ట్రైక్ ఇవ్వకుండా అట్కిన్సన్ ఓవర్ కీప్ చేస్తూ బ్యాటింగ్ కొనసాగించాడు. ఓ సిక్సర్ బాదిన అట్కిన్సన్ ఇంగ్లాండ్ విజయంపై ఆశలను పెంచేశాడు. ఇంగ్లాండ్ విజయానికి 7 పరుగులు అవసరమైన స్థితిలో అట్కిన్సన్ ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేసి ఇండియాకు చిరస్మరణీయమనదగ్గ విజయాన్ని అందించాడు.
స్కోర్లు.. ఇండియా తొలి ఇన్నింగ్స్ 224, రెండో ఇన్నింగ్స్ 396
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 247, రెండో ఇన్నింగ్స్ 367
ఫలితం ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం
నాలుగు వికెట్లను 29 పరుగులకే కూల్చేసింది.
http://www.teluguone.com/news/content/siraj-mafic-india-win-5th-test-by-six-runs-39-203472.html





