డాడీ..మోడీ..చిన్నమోడీ..ఏకకాలంలో ముగ్గురిపై కవిత విమర్శల దాడి
Publish Date:Mar 20, 2026
Advertisement
తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ జనజాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన తండ్రి కేసీఆర్ టార్గెట్ గా తాజాగా సంధించిన వమర్శనాస్త్రాలు రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన తండ్రి కేసీఆర్ ను, ప్రధాని మోడీనీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ ఒకే సమయంలో విమర్శలతో చెరిగేయడం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డాడీ, మోడీ, చిన్న మోడీ అంటూ ఆమె ప్రయోగించిన పదాలు ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ' అంటే తన తండ్రి కేసీఆర్ అని, 'చిన్న మోదీ' అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను ఆమె తూర్పారబట్టారు. అలాగే తన తండ్రి కేసీఆర్ సీఎంగా ఉండగా రాష్ట్ర ప్రగతి కుంటుపడిందంటూ విమర్శలు గుప్పించారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ నూ ఆమె వదల లేదు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కొద్ది కాలం పాటు తన తండ్రి కేసీఆర్ ను మాత్రం మినహాయించి బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్, తన అన్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లు లక్ష్యంగా ఆమె విరుచుకుపడ్డారు. అంతే కాకుండా బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నాయకులను సైతం వదలకుండా విమర్శల వర్షం కురిపించారు. అయితే ఇక సొంత పార్టీ పెట్టడానికి ముందు ఆమె ఏకంగా బీఆర్ఎస్ కుంభ స్థలాన్నే గురిపెట్టారన్నట్లుగా కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఆయన మానసపుత్రిక అయిన కాళేశ్వరాన్ని దండగమారి ప్రాజెక్టు గా అభివర్ణించారు. కాళేశ్వరం అవినీతిపై విచారణకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగిన కవిత ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టును ఇసుమంతైనా ఉపయోగం లేని ప్రాజెక్టు అని దుయ్యబట్డడమే కాకుండా.. ప్రజాధనం దుర్విని యోగమయ్యిందంటూ విమర్శలు చేశారు. కాళేశ్వరంలో అవినీతికి హరీష్ రావును బాధ్యుడిని చేయాలంటూ డిమాండ్ చేయడం ద్వారా ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. దీంతో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీపై కవిత విమర్శలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. కవిత విమర్శలు, ఆరోపణలపై బీఆర్ఎస్ అగ్రనాయకత్వం స్పందించకపోవడంతో మౌనం అర్ధాంగీకరం అన్న చందంగా కవిత ఆరోపణలల్లో వాస్తవం ఉందా అన్న చర్చ బీఆర్ఎస్ శ్రేణులలోనే మొదలైంది.
http://www.teluguone.com/news/content/simultaneous-criticism-on-thouse-three-leaders-39-215839.html




