సిద్దూ, రేవంత్.. ముందెవరు?
Publish Date:Mar 6, 2025
Advertisement
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్పు, పెద్ద విషయం కాదు. విశేషం అంతకంటే కాదు. ఐదేళ్ళలో ఐదుగురు ముఖ్యమంత్రులను బొమ్మల కొలువులో బొమ్మలను మార్చినట్లు మార్చిన ఘన చరిత్ర గల పార్టీ కాంగ్రెస్. అయితే మరక కూడా మంచిదే అన్నట్లుగా, అప్పట్లో హస్తం పార్టీ ముఖ్య మంత్రులను మార్చడం వలన కూడా మన రాష్ట్రనికి మంచే జరిగింది. అవును. ఒకప్పడు ఇందిరా గాంధీ, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ళలో ఐదుగురు ముఖ్యమంత్రులను మార్చడం వల్లనే, 1982లో నందమూరి తారక రామరావు సారథ్యంలో తెలుగు వాడి ఆత్మ గౌరవం నినాదంగా తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించింది. అక్కడితో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారి పోయింది. కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి పడింది. సంవత్సరం తిరగ కుండానే తెలుగు దేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టి, చరిత్ర సృష్టించింది. కాంగ్రేస్సేతర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. బడుగులకు పెద్ద పీట వేశారు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది చరిత్ర. ఆ విషయాన్ని పక్కనపెట్టి, విషయంలోకి వస్తే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కేవలం మూడంటే మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో వుంది. అందులో హిమాచల్ లో గ్యారెంటీల అమలు చేయలేక చేతులేత్తేసే పరిస్థతిలో వుంది. అది వేరే కథ.. మిగిలిన రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి మార్పుపై రచ్చ రచ్చగా చర్చ జరుగుతోంది. అవును. ఇరుగు పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్పు తప్పదన్న వార్తలు గప్పు మంటున్నాయి. ఎక్కడ ఏ ఇద్దరు కాంగ్రెస్ నాయకులు కలిసినా ఇవే గుసగుసలు , ఇవే ముచ్చట్లు. ఇవే చర్చలు. నిజానికి పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై చాలా కాలంగా చర్చ నడుస్తోంది. రెండేళ్ళ క్రితం హస్తం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే, ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠం కోసం ‘కుర్చీ’ పట్లు పట్టారు. చివరకు, అధిష్టానం ఇద్దరి మధ్య కుర్చీ పంపకాల ఒప్పందం కుదిర్చింది. చెరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేలా అధిష్టానం సాక్షిగా లోపాయికారీ ఒప్పందం కుదిరిందని అంటారు. ఆ ఒప్పం దం ప్రకారం ముందు సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పడు ఆ రెండున్నరేళ్ళు ముగుస్తున్న నేపధ్యంలో మరోమారు ఇద్దరి మధ్య కుర్చీ పట్లు మొదలయ్యాయి. పార్టీలో అంతర్గతంగా ఏమి జరుగుతుందో ఏమో కానీ కర్ణాటకం తాజా ఎపిసోడ్ పై జాతీయ మీడియాలో సైతం చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరో వంక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ద రామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ వర్గాలకు చెందిన నాయకులు బహిరంగంగానే మార్పు కు సబందించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలి ముఖ్యమంత్రి మార్పు అనివార్యమని కుండబద్దలు కొట్టారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ మొయిలీ అరివీర భయంకర వ్యాఖ్యలు చేశారు. అంతకంటే ముందే మరో సీనియర్ నాయకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ శివగంగ మరో అడుగు ముందుకేసి, జూన్ , డిసెంబర్ మధ్యలో ఎప్పుడైనా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. అయితే, వీరప్ప మొయిలీ ఇవాళో, రేపో కూడా ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చని అంటున్నారు. ఇదే సమయంలో డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశంకావడంతో ముఖ్యమంత్రి మార్పు చర్చ మరింత వేడెక్కింది. మరో వంక డీకే, కర్ణాటక షిండే అవుతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో డీకే .. వాట్ నెక్స్ట్ ..? అనే ఊహా గానాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకాషికార్లు చేస్తున్నాయి. సరే..కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంటే దానికో నేపధ్యం, ఒప్పందాలు, ఉల్లంఘనలు కథా కమామీషు ఉన్నాయి. కానీ తెలంగాణలోనూ ముఖ్యమంత్రి మార్పు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతే కాదు, ముఖ్యమంత్రి రేవంతే రెడ్డి తరచూ ఢిల్లీ వెళ్లడం... ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ శాఖల మంత్రులను కలవడం.. అదే సమయంలో రాహుల్ గాంధీతో దూరం పెరుగుతున్న సంకేతాలు రావడంతో తెర వెనక కథ.. ఏమిటనే విషయంలో ఎవరికి తోచిన విధగా వారు ఉహాగానాలు అల్లుకుంటున్నారు. వాస్తవం ఏదైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు మొదటి నుంచి ఆయన్నువ్యతిరేకిస్తున్న, సేనియర్లు మళ్ళీ మరో మారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయంలో మాత్రం ఎవరికీ ఏ మాత్రం అనుమానం లేదు. అందుకే అసలు పార్టీలో అంతర్గతంగా ఏమి జరుగుతోందో స్పష్టంగా తెలియక పోయినా, కర్ణాటకలో నడుస్తున్న ముఖ్యమంత్రి మార్పు రాజకీయానికి సమాంతరంగా తెలంగాణలోనూ ముఖ్యమంత్రి మార్పు ప్రయత్నాలు ముమ్మరగా సాగుతున్నాయి. అంతే, కాదు కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి అంటూ మీడియా కథనాలు వండి వార్చేస్తోంది కూడా. అయితే అక్కడ కర్ణాటకలో కానీ, ఇక్కడ తెలంగాణలో కానీ ముఖ్యమంత్రి మార్పు నిజంగా జరుగుతుందా? అంటే .. అవుననో కాదనో చెప్పడం ప్రస్తుతానికి సాహసమే అవుతుంది.
http://www.teluguone.com/news/content/siddaramayya-and-revanth-who-will-be-1st-to-go-25-193936.html





