షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో పహల్గాం ఉగ్రవాదులు
Publish Date:Jun 27, 2026
Advertisement
పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్, ప్రపంచ క్రికెట్ లో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద సోదరుడు షాహిద్ అక్తర్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్తర్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్‌లోని హెచ్-8 శ్మశానవాటికలో జూన్ 24న షాహిద్ అక్తర్ అంత్యక్రియలు అత్యంత నిశ్శబ్దంగా జరిగాయి. అయితే, ఈ విషాద కార్యక్రమం కాస్తా ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక పెద్ద రాజకీయ మరియు భద్రతాపరమైన వివాదంగా రూపాంతరం చెందింది. అందుకు కారణం ఆ అంత్యక్రియల వేడుకకు పాకిస్థాన్‌కు చెందిన పలువురు ప్రమాదకరమైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హాజరుకావడమే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ప్రత్యేక వీడియోల ప్రకారం, నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన అత్యున్నత స్థాయి కమాండర్లు మరియు నాయకులు ఈ అంత్యక్రియల్లో బహిరంగంగా పాల్గొన్నారు. ముఖ్యంగా, లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఈ అంత్యక్రియల ప్రార్థనల్లో పాల్గొనడం తీవ్ర కలకలం రేపింది. సైఫుల్లా కసూరి సామాన్యమైన వ్యక్తి కాదు, ఏప్రిల్ 22, 2025న కాశ్మీర్‌లోని పహల్గాంపై జరిగిన ఘోర ఉగ్రదాడికి ఇతడే ప్రధాన సూత్రధారి అని భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. ఆనాటి పహల్గాం దాడిలో 25 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘోర ఉగ్రదాడి తర్వాత భారత్ అత్యంత కఠినంగా స్పందిస్తూ ఇండస్ వాటర్స్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేయడమే కాకుండా, మురిద్కేలోని లష్కర్ ప్రధాన కార్యాలయంపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించింది. అటువంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఇస్లామాబాద్ నడిబొడ్డున ఇంత బహిరంగంగా తిరగడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఈ వివాదం ఇంతటితో ఆగలేదు, ఐక్యరాజ్యసమితి నిషేధించిన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ మరియు లష్కరే తోయిబా రాజకీయ ముఖచిత్రంగా భావించే పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఇనామ్ ఉర్ రెహ్మాన్ కంబో కూడా ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. 2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఈ పీఎమ్ఎమ్ఎల్ పార్టీ, వాస్తవానికి నిషేధిత జమాత్-ఉద్-దవా మరియు మిల్లీ ముస్లిం లీగ్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడింది. ఈ నాయకులంతా కలిసి అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు రావడంపై నెట్టింట భిన్నమైన చర్చ నడుస్తోంది. అయితే, ఈ ఉగ్రవాదుల రాకతో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌కు నేరుగా ఎటువంటి సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. కానీ, పాకిస్థాన్‌లో నిషేధిత సంస్థల నాయకులు, ఉగ్రవాదులు ఎంత స్వేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారనే దానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యమని భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సైఫుల్లా కసూరి వంటి ఉగ్రవాదులు గతంలో తాము పాక్ ఆర్మీ అధికారిక కార్యక్రమాలకు వెళ్తుంటామని, సైనికుల అంత్యక్రియలకు ప్రార్థనలు సైతం లీడ్ చేస్తుంటామని బహిరంగంగానే ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే మార్చి 2026 నాటి యూఎస్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక కూడా పాకిస్థాన్ ఇప్పటికీ ఉగ్రవాదులకు సురక్షిత ఆశ్రయంగా ఉందని స్పష్టం చేసింది. షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్ ఉగ్రవాద బుద్ధిని మరోసారి ఎండగడుతున్నాయి.
http://www.teluguone.com/news/content/shoaib-akhtar-brother-funeral-36-224349.html





