శిల్పా బ్రదర్ అటో-ఇటో... నంద్యాల రాజకీయంలో కొత్త ట్విస్ట్...?
Publish Date:Aug 2, 2017
Advertisement
నంద్యాల ఉపఎన్నికలవేళ కర్నూలు జిల్లా రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం రాజకీయమంతా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి చుట్టూ తిరుగుతోంది. ఆయన వైసీపీలో చేరేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ మారడంపై అనుచరుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి టైమ్ చూసి టీడీపీ అధిష్టానానికి టెన్షన్ తెప్పిస్తున్నారు. అవకాశం దొరికింది కదా అని తన డిమాండ్ల చిట్టా తీసి హైకమాండ్ ని చికాకు పెడుతున్నారు. నంద్యాల ఉపఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోన్న టీడీపీకి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. తనను శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటిస్తేనే పార్టీలో ఉంటానంటూ చక్రపాణిరెడ్డి షరతు పెట్టారు. మంత్రి అఖిలప్రియ తనను గౌరవించడం లేదని అసంతృప్తి వెళ్లగక్కారు. తన సోదరుడు ఇదే కారణంతో పార్టీని వీడారని.. పద్ధతి మారకపోతే తను కూడా వెళ్లాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎంపీ సీఎం రమేష్... శిల్పా చక్రపాణిరెడ్డితో చర్చలు జరిపినా ఫలితం లేనట్టు చెబుతున్నారు. భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగి చక్రపాణికి సర్దిచెప్పారు. దీంతో శిల్పా బ్రదర్ పార్టీ వీడాలన్న నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే చక్రపాణిరెడ్డి అసంతృప్తిని పసిగట్టిన వైసీపీ నాయకత్వం... ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డిలతోపాటు ఆయన సోదరుడు మోహన్ రెడ్డిని కూడా పంపి చర్చలు జరిపింది. అన్నదమ్ముల సెంటిమెంట్ సహా పలు అంశాలు వర్కౌట్ అయినట్టు సమాచారం. దాంతో హడావిడిగా శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాలకు చెందిన ముఖ్య కార్యకర్తలతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఒక్కొక్కరితో భేటీ అయి పార్టీ మారడంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. మెజారిటీ కార్యకర్తలు వైసీపీలోకి వెళ్లిపోదామని చెబుతుండటంతో ఫ్యాన్ పార్టీలోకి వెళ్లడంపై ప్రకటన లాంఛనమేనని తెలుస్తోంది. జగన్ నంద్యాల పర్యటనలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/shilpa-chakrapani-reddy-45-76753.html





