షర్మిలా వర్సెస్ జగన్.. ఆస్తిగొడవలూ, రాజకీయాలు!
Publish Date:Oct 29, 2024
Advertisement
ఆస్తుల వ్యవహారంలో వైఎస్ కుటుంబం బజారున పడుతున్నది. ప్రజాజీవితంలో ఉన్నవారికి వ్యక్తిగతం అనేది ఉండదని రాజకీయోక్తి. అదే నేడు జగన్,షర్మిల విషయంలో నిజమవుతున్నది.. ఆస్తుల విభేదాలు ఎలా ఉన్నా వైఎస్ కుటుంబం లోని లొసుగులన్నీ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో బయటపడి వైఎస్ కుటుంబం నవ్వుల పాలౌతోంది. జగన్, షర్మిల మధ్య అన్నా చెల్లెళ్ల అనుబంధం, రక్త సంబంధం కంటే ఆస్తి గొడవలే పెద్ద పీట వేసుకు కూర్చున్నాయి. జగన్ ఇక షర్మిలపై వ్యాఖ్యలు చేయనని ప్రకటించడం తన ప్రతిష్ఠ మరింత మసకబారకుండా ఉండటానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక షర్మిలపై వ్యాఖ్యలు చేయనని ప్రకటిస్తూ ఆయన రాసిన లేఖ.. షర్మిలను మరింత రెచ్చగొట్టేదిలా ఉంది తప్ప సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రయత్నంలా ఇసుమంతైనా లేదు. ఎవరు ఎంతగా గింజుకున్నా, సొంత పరువు బజారున పడేసుకునేలా వ్యవహరించినా జగన్ షర్మిల మధ్య ఆస్తుల తగాదాను తీర్చాల్సింది న్యాయస్థానాలే తప్ప రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో ఓరిగేదేం ఉండదు. ఇప్పటికే షర్మిల జగన్ మధ్య రాజకీయ వైరుద్ధ్యం, వ్యక్తిగత వైరం చల్లారే అవకాశాలు లేని స్థాయికి వెళ్లిపోయాయి. జగన్ రెండడుగులు ముందుకు వేసి తన కుటుంబ వ్యవహారాన్ని వైసీపీ రాజకీయ వ్యవహారంగా మార్చేశారు. సొంత చెల్లి అన్న అనుబంధం మరిచి తన పార్టీ నేతల చేత షర్మిలపై అనుచితంగా విమర్శల దాడి చేయించారు. ఆమె వ్యక్తిత్వ హననానికి కూడా వెనుకాడలేదు. మొత్తంగా జగన్ తీరు పట్ల రాజకీయాలతో సంబంధం లేని వారు కూడా ఏవగించుకునేలా ఉంది. వైఎస్ అభిమానులైతే జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే స్థాయిలో షర్మిల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. షర్మల కూడా అన్న అనుచిత తీరును, ఆయన పార్టీ నేతల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్నారు. వైఎస్ మరణం వెనుక టీడీపీ హస్తం ఉందని,ముఖ్యంగా చంద్రబాబు హస్తం ఉందని విజయసాయిరెడ్డి తదితరులు ఆరోపించడం, దానికి షర్మిల అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో గాడిదలు కాసారా ,క నీసం విచారణ కూడా ఎందుకు చేయలేదని ధ్వజమెత్తారు. కని పెంచిన తల్లి విజయమ్మ పై కూడా కేసు వేసిన విషనాగు జగన్ అని షర్మిల ఘాటుగా విమర్శలు చేశారు. వైఎస్ ఆస్తులు పంచారని,మిగిలినవి జగన్ స్వార్జితమేనని విజయసాయి చెప్పడం ఆశ్చర్యం. వైఎస్ చనిపోయే నాటికి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 2009లో జగన్ ఆస్తుల విలువ రూ.77 కోట్లు మాత్రమే. అది 2024కల్లా రూ.530కోట్లకు చేరింది. అదెలా సాధ్యమయ్యిందో జగన్ వివరించి ఉండాల్సింది. స్వార్జితం, చెమటోడ్చి సంపాదించాను అని జగన్ చెప్పడం నమ్మశక్యంగా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అది పక్కన పెడితే చంద్రబాబు వదిలిన విషపు బాణం షర్మిల అని జగన్ అనుయాయిలు ఆరోపించడం, ఆమెకు పీసీసీ పదవి ఇప్పించిందే చంద్రబాబు అని అనడం విడ్డూరంగానే కాదు, హాస్యాస్పదంగా కూడా ఉన్నాయి. ఏదిఏమైనా ఆస్తులు తగాదాలు రాజకీయాలతో కలపడం, సందర్భం వచ్చిందని దుమ్మెత్తిపోయడం సబబు కాదని,రాజకీయాలను మరింత దిగజార్చవద్దని వైఎస్ అభిమానులు జగన్ కు సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/sharmila-versus-jagan-politics-25-187590.html