వి మిస్ యూ డాడీ.. షేన్‌వార్న్ జ్ఞాపకాల్లో పిల్లలు..
Publish Date:Mar 8, 2022
Advertisement
షేన్‌వార్న్ సడెన్ డెత్ యావత్ క్రికెట్ అభిమానులను కలిచివేసింది. ఆ స్పిన్ మాంత్రికుడు ఇక లేరనే వార్త.. వివిధ దేశాల్లో ఉన్న వారితో కంటతడి పెట్టించింది. అభిమానుల గుండెలు పిండేసింది. కేవలం టీవీల్లో ఆయన ఆట చూసి.. ఇంప్రెస్ అయిన మనకే.. వార్న్ మరణవార్త ఇంత బాధ కలిగిస్తే.. ఇక ఎంతో ప్రేమను పంచే తండ్రి ఇక లేరని.. తిరిగి రారనే చేదు నిజం తెలిసి.. ఆయన పిల్లలు తల్లడిల్లిపోతున్నారు. వి మిస్ యూ డాడీ అంటూ రోధిస్తున్నారు. షేన్‌వార్న్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. తండ్రికి నివాళులు అర్పిస్తూ భావోద్వేగపూరిత లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుమారుడి లేనిలోటు తీర్చలేనిదంటూ షేన్‌వార్న్ పేరెంట్స్ కీత్, బ్రిగిట్‌లు సైతం విషాధం వ్యక్తం చేశారు. ‘‘మా నాన్నే నాకు బెస్ట్ ఫ్రెండ్. లవ్ యూ డాడీ. నా హృదయంలో మిగిల్చి వెళ్లిన శూన్యతను ఏదీ పూరించలేదని భావిస్తున్నా. పోకర్ టేబుల్ పక్కన కూర్చొని ఉండటం, గోల్ఫ్ కోర్స్‌లో వాకింగ్, పిజ్జా తినడం.. ఇలా ఏదీ అప్పటిలా ఉండబోదు. ఎల్లవేళలా నేను సంతోషంగా ఉండాలని ఎప్పుడూ నువ్వు కోరుకుంటావని నాకు తెలుసు. అందుకే ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తా’’ --షేన్‌వార్న్ కుమారుడు జాక్‌సన్ ‘‘డాడీ.. నిన్ను చాలా మిస్ అవుతున్నా. నిజంగా నువ్వు ఉత్తమ తండ్రివి. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నాన్న. జీవితం ఎంతో క్రూరమైంది.. నా తండ్రిని చాలా త్వరగా తీసుకెళ్లింది. నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్న చివరి జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుకు పెట్టుకుంటా. మనమిద్దరం చాలా విషయాల్లో సారూప్యత కలిగి ఉన్నాం. మీ నుంచి వారసత్వంగా వచ్చిందని, నాకు అదే కోపం తెప్పించిందని అప్పుడప్పుడూ నేను జోక్ చేస్తుండేదానిని ’’ --వార్న్ పెద్ద కుమార్తె బ్రూక్ ‘‘మిమ్మల్ని నాన్న అని పిలవడం ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా డాడీ. ఇప్పటికే చాలా మిస్ అవుతున్నాను. నేను నిన్ను గట్టిగా కౌగలించుకుని ఆనందించిన క్షణాలే నాకు చివరివి అవుతాయని ఊహించలేదు. మీతో గడపడానికి నాకు ఎక్కువ సెలవులు కావాలి. సంతోషంగా గడపాలి. మీ నవ్వుతో గదినంతా వెలుగుమయం చేస్తారు. ఇంకానూ ‘గుడ్‌నైట్.. ఐ లవ్ యూ’’ అని అనాలి. మీరు పక్కన ఉంటే మేమంతా ఎంతో సురక్షితంగా ఉంటామనే నమ్మకం. మీరు మరణించలేదు నాన్న.. ఇక్కడ నుంచి వేరొక ప్రదేశానికి వెళ్లారు.. అది మా హృదయంలోకి’’ --షేన్ చిన్న కుమార్తె సమ్మర్
http://www.teluguone.com/news/content/shane-warne-childrens-letter-in-social-media-39-132770.html





