విమల్ ఇలాచీ యాడ్ వివాదం.. షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్‌కు నోటీసులు..!
Publish Date:Aug 16, 2026
Advertisement
బాలీవుడ్ స్టార్ హీరోలు షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు ఊహించని చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. సుప్రసిద్ధ ‘విమల్ ఇలాచీ’ ప్రచార ప్రకటనలో నటించినందుకు గాను మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (FDA) ఈ ముగ్గురు నటులకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో నిషేధంలో ఉన్న విమల్ పాన్ మసాలా ఉత్పత్తులను 'సర్రోగేట్ అడ్వర్టైజింగ్' (పరోక్ష ప్రచారం) పద్ధతిలో విమల్ ఇలాచీ పేరిట ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ తుకారాం ముండే నేరుగా ఈ ఆదేశాలను వెలువరించడం గమనార్హం. నోటీసుల ప్రకారం, సదరు నటులు తక్షణమే ఈ బ్రాండ్ ప్రచార కార్యక్రమాల నుంచి వైదొలగాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, వారి సోషల్ మీడియా ఖాతాలలో ఉన్న సంబంధిత ప్రకటనల ఫోటోలు, వీడియోలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. కంపెనీతో చేసుకున్న ఒప్పంద పత్రాలను కూడా అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. వినియోగదారుల పరిరక్షణ చట్టం నిబంధనల ప్రకారం ఈ ఆరోపణలు కనుక న్యాయస్థానంలో రుజువైతే, సదరు నటులపై తీవ్ర పరిణామాలు ఉండే అవకాశముంది. రూ. 10 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 50 లక్షల వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. దీంతో పాటు, తీవ్రతను బట్టి ఏడాది నుంచి మూడేళ్ల కాలపరిమితి వరకు ఏ విధమైన వాణిజ్య ప్రకటనల్లోనూ నటించకుండా నిషేధం ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇది సదరు తారల బ్రాండ్ విలువపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా మారింది. గతంలో కూడా ఈ తరహా వివాదాలు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. 2022లో ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఇదే విమల్ బ్రాండ్ ప్రకటనలో కనిపించినప్పుడు అభిమానుల నుంచి, ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ సమయంలో ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పి, సదరు కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తొగాక్, పాన్ మసాలా వంటి ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తుల పరోక్ష ప్రచారాలపై సమాజంలో, ముఖ్యంగా యువతలో విస్తృత చర్చ జరుగుతోంది. తమ అభిమాన నటులు ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సహించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ షోకాజ్ నోటీసులపై షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ బృందాలు ఎలా స్పందిస్తాయో, వారు ప్రకటనల నుంచి తప్పుకుంటారో లేదో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో అని సినీ ప్రియులు ఆసక్తిగా గమనిస్తున్నారు. Shah Rukh Khan, Ajay Devgn, Tiger Shroff, Vimal Elaichi Ad Controversy, Maharashtra FDA Show Cause Notice
http://www.teluguone.com/news/content/shah-rukh-khan-36-229021.html





